Begin typing your search above and press return to search.

సారు దయతోనే సమ్మె సమిసి పోవాలట

By:  Tupaki Desk   |   25 Nov 2019 7:07 AM GMT
సారు దయతోనే సమ్మె సమిసి పోవాలట
X
సమ్మెల కు సర్కారు హడలిపోవాలి. బాబ్బాబు.. కాస్త తగ్గండని అధికారంలో ఉన్నవారు వేడుకోవాలి. ఉద్యమ నేతలు ఘీంకరిస్తే.. మీరలా చేస్తే మేమేం కావాలని అధికారపక్షం కూసింత కోపంతో ప్రశ్నించాలి. పవర్లో ఉన్నోడితో పెట్టుకుంటే ఇబ్బంది కాబట్టి.. సర్లే.. అంతగా అడుగుతున్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే పోయేదేముందని తగ్గాలి. మొత్తంగా సమ్మె మొదలై.. తీవ్రరూపం దాల్చి చప్పున చల్లారే ఒక ప్రాసెస్ తొలిసారి కట్టు తప్పింది.

సమ్మెకు ఎలాంటి షాకులు ఇవ్వాలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల కు అర్థమయ్యేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తనకు నచ్చనిది ఏదైనా సరే జరగకూడదన్నట్లు వ్యవహరించే వైఖరి ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తున్నారు. మీకు టైమిస్తున్నా.. ఉద్యోగాల్లో చేరండని రెండుసార్లు ఘీంకరిస్తే.. మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో మాకు తెలుసన్నట్లుగా ఉద్యమ నేతల అంచనాలకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వేలాది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.

చివరకు.. కార్మికులు డిపోలకు వెళ్లి.. మేం ఉద్యోగాల్లో చేరతామని వేడుకుంటున్నా.. నో.. పై నుంచి ఆదేశాలు రాలేదంటూ వెనక్కి పంపించేస్తున్న దుస్థితి. సమ్మె ప్రారంభమై యాభై ఒక్కరోజులైంది. చూస్తుండగానే మూడు నెలలుగా జీతాల్లేక ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు. ఏదో చేస్తుందని భావించిన హైకోర్టు నుంచి ఆశించినంతగా ఆదేశాలు రాక పోవటం.. నమ్ముకున్న విపక్షాలు చేతులెత్తేయటం తో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి త్రిశంక స్వర్గంగా మారింది. ఇప్పుడు సారు దయ తప్పించి తమను మరేమీ ఆదుకోలేవన్న విషయం ఆర్టీసీ ఉద్యోగులకు క్రమంగా అర్థమవుతోంది.

సమ్మె మొదట్లో ఇబ్బంది పడిన ప్రజలు.. సుదీర్ఘంగా సాగుతున్న సమ్మె తో ఎవరికి వారు.. వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాల్ని చూసుకుంటూ సమ్మె కారణంగా పడే చికాకుల్ని తగ్గించుకుంటున్నారు. ప్రజల నుంచి అసౌర్యానికి గురవుతున్నట్లుగా కంప్లైంట్లు పెద్దగా రాని నేపథ్యం లో కార్మికుల సంగతి చూడాలన్న సారు పట్టుదల అంతకంతకూ పెరిగి పోతోంది.

మీడియా సైతం పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం తో ఆర్టీసీ కార్మికుల కు కేసీఆర్ తప్పించి వేరెవరూ ఆదుకోలేన్నట్లు పరిస్థితి మారింది. తన నోట్లో నుంచి ఒక మాట వచ్చాక ఆ విషయంలో వెనక్కి తగ్గటం అన్నది తన హిస్టరీలో లేదన్నట్లుగా ఫీలయ్యే కేసీఆర్.. కార్మికులను మన్నించే అవకాశమే లేదు.

అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే తప్పించి ఆయన వైఖరి లో మార్పు రాదు. ఈ నేపథ్యం లో ఆర్టీసీ కార్మికుల కడగండ్లు అంతకంతకూ పెరిగేవే తప్పించి తగ్గేవి కాదన్నది నిజం. మొత్తంగా కార్మికుల భవిష్యత్తు కేసీఆర్ చేతిలో మాత్రమే ఉందన్నది సత్యం.