Begin typing your search above and press return to search.

ఉప పోరు కోసం 86 మంది ఎమ్మెల్యేలు.. కేసీఆరా మజాకానా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 5:10 AM GMT
ఉప పోరు కోసం 86 మంది ఎమ్మెల్యేలు.. కేసీఆరా మజాకానా?
X
క్లౌడ్ బరస్ట్ తెలుసు కదా? అప్పటివరకు మామూలుగా ఉన్నట్లే ఉండి.. ఒక్కసారిగా కుండపోతగా కుమ్మరించేసే వర్షం. అతి తక్కువ వ్యవధిలో అతి ఎక్కువగా వర్షం దంచి కొట్టేసే తీరు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది. చూస్తుంటే.. మునుగోడు ఉప పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ ఫార్ములాను అందిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన ఎన్నిక కోసం ఆయన అసాధారణ ప్లానింగ్ చేశారు. ఒక అసెంబ్లీ ఎన్నికను సొంతం చేసుకోవటం కోసం తనకున్న వనరుల్ని మొత్తంగా డంప్ చేయటం చూసినప్పుడు.. మునుగోడులో విజయం ఆయనకు ఎంత అవసరమన్న విషయాన్ని చెప్పేస్తుందని చెప్పాలి.

మునుగోడు టాస్కును చేధించేందుకు పార్టీకి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించే హరీశ్ రావును రంగంలోకి దించిన కేసీఆర్.. ఆయనకు పెద్ద పరీక్షే పెట్టారని చెప్పాలి. హరీశ్ కు మాత్రమే బాధ్యతలు అప్పజెప్పకుండా తన రాజకీయ వారసుడు కేటీఆర్ కు సైతం మునుగోడు బాధ్యతను అప్పజెప్పటం గమనార్హం. వీరిద్దరికి తోడుగా భారీ ఎత్తున ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. మొత్తం 86 మంది ఎమ్మెల్యేలకు మునుగోడు బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్.

మునుగోడును 86 యూనిట్లుగా విభజించిన కేసీఆర్.. ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యేను ఇంఛార్జి ఉండేలా ప్లాన్ చేశారు. వారంతా తమకు కేటాయించిన గ్రామంలో పార్టీకి ఓట్లు పడేలా పని చేయాల్సి ఉంటుంది.
దసరా పండుగ అయిన వెంటనే.. వారంతా పొజిషన్ తీసుకోనున్నారు.

తాను అప్పగించిన బాధ్యతను చేపట్టే క్రమంలో ఈ 86 మంది ఎమ్మెల్యేలంతా మునుగోడులో మొహరించాల్సి ఉంటుంది. తన అనుచర వర్గంతో వెళ్లి.. తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఆకర్షించటం.. గులాబీ కారుకు ఓటు వేయించటమే వారి టాస్కుగా మారనుంది. ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించారు.

పార్టీ తరఫున ఇంఛార్జిగా హరీశ్.. ఉప పోరు ఎన్నికల ప్రచార వ్యవహారాల్ని మంత్రి జగదీష్ రెడ్డికి అదనపు బాధ్యతల్ని అప్పజెప్పారు. కేసీఆర్ తాజా ఆదేశాల నేపథ్యంలో దసరా తర్వాత పార్టీకి చెందిన సింహ భాగం ఎమ్మెల్యేలంతా మునుగోడులోనే బస చేయాల్సి ఉంటుంది.

అంటే.. ఎక్కడ చూసినా.. గులాబీ ఎమ్మెల్యేలు నియోజకవర్గమంతా దర్శనమిస్తారని చెప్పక తప్పదు. ఇంత భారీగా తనకున్న బలగం మొత్తాన్ని నియోజకవర్గంలో మొహరిస్తున్న కేసీఆర్ కు.. మునుగోడు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.