Begin typing your search above and press return to search.

అతి జాగ్రత్త దేనికి సంకేతం ?

By:  Tupaki Desk   |   23 Oct 2021 11:30 PM GMT
అతి జాగ్రత్త దేనికి సంకేతం ?
X
ఈనెల 30వ తేదీన జరగబోతున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ నానా అవస్థలు పడుతోంది. ఇక్కడ గెలుపును లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్న కేసీయార్ తీసుకుంటున్న జాగ్రత్తలు చాలా అతిగానే అనిపిస్తున్నాయి. ఒక ఉపఎన్నికలో గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరమా అనే డౌట్ వస్తోంది. పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పార్టీకి ఊపుతెచ్చేందుకు కోసం తన ఆధ్వర్యంలో ఒక బహిరంగసభ కానీ లేదా రెండో రోజులు రోడ్డుషోలు కానీ నిర్వహించేట్లు కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గం పక్కనే ఉన్న హన్మకొండ జిల్లాలోని పెంచికల్ పేటలో ఈనెల 27వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు కేసీయార్. అయితే ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని తెలిసింది. దాంతో తమ ప్రయత్నాన్ని మార్చుకుని బహిరంగ సభ హుస్నాబాద్ లో పెట్టుకుందామా లేక హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు రోజులు వరుసగా రోడ్డు షోలు నిర్వహించాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బహిరంగ సభ అయినా రోడ్డు షోలైనా చివరి వారంలోనే ఉంటాయన్నది మాత్రం వాస్తవం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దాదాపు మూడు నెలలుగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. వారంతా నియోజవర్గంలో తిరుగుతున్నది తిరుగుతున్నదే. వీళ్ళు కాకుండా ఓవరాల్ బాధ్యునిగా హరీష్ రావు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. హరీష్ కాకుండా మధ్య మధ్యలో కేటీయార్ కూడా తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళంతా సరిపోదన్నట్లుగా రెండుసార్లు కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

అన్నింటికీ మించి ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఇక సామాజిక వర్గాల వారీగా వరాల వర్షం కురిపిస్తున్నారు. ఓటుకు ఇంతని టీఆర్ఎస్ భారీ మొత్తంలో ఓటర్లను కొనుగోలు చేస్తోందంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తునే ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా లాంగ్ పెండింగ్ పనులన్నింటినీ చేయడం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేసేశారు.

ఒకవైపేమో ఉపఎన్నికలో గెలిచినా తమకు కొత్తగా వచ్చేదేమీ లేదని కేసీయార్+కేటీయార్ చెబుతునే ఉన్నారు. ఇదే సమయంలో ఎలాగైనా గెలవాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు టార్గెట్ పెట్టారు. ఇవన్నీ సరిపోవన్నట్లు ఏకంగా రెండు రోజులు నియోజకవర్గంలో రోడ్డుషోలట. ఇదంతా చూస్తుంటే కేసీయార్ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు చేయించుకున్న సర్వే ఫలితాలన్నీ ఈటలకే అనుకూలంగా ఉన్నాయట. అందుకనే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితంలో తేడా కొట్టిందంటే అంతే సంగతులు.