Begin typing your search above and press return to search.

మోడీ నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:14 PM GMT
మోడీ నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఏం చెప్పారు?
X
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న సామెతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఒక సన్నివేశం ఈ రోజున చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు రాష్ట్రాలు ఎంత సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవటంతో పాటు.. ఆయా ముఖ్యమంత్రులు..లెఫ్ట్ నెంట్ గవర్నర్ల సలహాలు.. సూచనలు తీసుకునేందుకు... వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ ఈ రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించటం తెలిసిందే.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమీక్షకు హాజరుకావటం ఆసక్తికరంగా మారింది. ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకున్నప్పుడు సలహాలు.. సూచనలు ఇచ్చే అలవాటున్న కేసీఆర్.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎలా రియాక్టు అవుతారన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది.

ఈ రోజు (మంగళవారం) జరిగిన సమీక్షా సమావేశంలో ప్రధాని మోడీకి.. తెలంగాణ సీఎం కేసీఆర్ విలువైన సూచనలు అందజేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ను అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దంగా ఉందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లేతమ వద్ద పక్కా ప్లాన్ ఉందన్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్ కారణంగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ దేశం మొత్తంఒకేలాంటి ప్రభావాన్ని చూపలేదని.. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సైడ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందన్నారు.

అందుకే.. వ్యాక్సిన్ ను మొదట అన్ని రాష్ట్రాలకు కొన్ని డోస్ లను పంపాలని.. ఒక్కో రాష్ట్రంలో కొందరికి వ్యాక్సిన్ అందజేసి..పదిహేను రోజుల పాటు వెయిట్ చేసి.. అప్పటి పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాతే మిగిలిన వారికి ఇవ్వాలన్నారు. ఇదంతా చూస్తే.. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరించాల్సిన కీలక అంశాల్ని కేసీఆర్ ప్రస్తావించారని చెప్పక తప్పదు. రాజకీయం రాజకీయమే.. ప్రజల హితానికి పెద్ద పీట వేస్తానన్న సంకేతాల్ని తాజా ఎపిసోడ్ లో గులాబీ బాస్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.