Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు కొత్త బాధ్య‌త‌ల వెనుక లెక్క‌లు వేరు

By:  Tupaki Desk   |   15 Sept 2016 9:16 PM IST
కేటీఆర్‌ కు కొత్త బాధ్య‌త‌ల వెనుక లెక్క‌లు వేరు
X
టీఆర్ ఎస్ అదినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న త‌న‌యుడు కేటీఆర్‌ ను పార్టీలో - అధికారంలో మ‌రింత‌గా క్రియాశీలం చేయ‌నున్నారా? ఈ క్ర‌మంలో కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు త‌ద్వారా పార్టీలో కేటీఆర్ ముద్ర వేసేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు - ఐటీ - మునిసిపల్‌ శాఖల మంత్రిగా ఉన్న‌ కేటీఆర్‌ మరో కీలక బాధ్యతను అప్పగించే యోచనలో టీఆర్ ఎస్‌ హైకమాండ్ ఉంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే త‌న‌కున్న ఐదు శాఖల‌నూ సమర్థవంతంగా నిర్వహిస్తున్న కేటీఆర్‌ ను కొత్తగా ఏర్పడబోతున్న పెద్దపల్లి జిల్లా కింద వచ్చే పెద్దపల్లి అసెంబ్లీ నియోజవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జిగా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు ఆర్థిక కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తెలంగాణలోని హైదరాబాద్‌ అనంతరం ధనిక జిల్లాగా కరీంనగర్‌ కు పేరు రావడానికి పరిశ్రమల వాతావరణమే కారణం. కరీంనగర్‌ లో పెద్దపల్లి - జగిత్యాల రెండు జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. సింగరేణి బావులు - దేశంలోనే ప్రముఖ విద్యుత్‌ కేంద్రాలలో ఒకటైన రామగుండంలోని ఎన్టీపీసి - ఎఫ్‌ సీఐ- కేశోరాం సిమెంట్స్‌ తదితర భారీ పరిశ్రమలున్న ప్రాంతాలన్నీ పెద్దపల్లి జిల్లా పరిధిలోనే వస్తాయి. అంతేకాకుండా త్వరలో పున:ప్రారంభం కానున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలు కూడా పెద్దపల్లి జిల్లాలోనే ఉండబోతోంది. ఈ ప్రాంతంలోనే విమానా శ్రయం - రోడ్డు - రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా గోదావరి తీరప్రాంతాలు మరింతగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయి. ఫలితంగానే కేటీఆర్‌ కు వ్యూహాత్మకంగా ఈ జిల్లాలో పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారని చెబుతున్నారు. పరిశ్రమలతో కూడిన ఆ ప్రాంతమంతా పెద్దపల్లిగా విడిపోతుండటంతో ముందుగానే అప్రమత్తమైన టీఆర్‌ ఎస్‌ అధిష్టానవర్గం ఈ అంశంపై లోతుగా చర్చించి కేసీఆర్‌ పట్టు సాధించేలా పావులు కదుపుతోందని స‌మాచారం.

పూర్తిగా పారిశ్రామిక వాతావర ణాన్ని కలిగి వున్న పెద్దపల్లి సమీప భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలుండటంతో కేటీఆర్‌ కు పెద్దపల్లి అసెంబ్లి సెగ్మెంట్‌ కు టీఆర్‌ ఎస్‌ ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం.పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమంత్రి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయవర్గాల స‌మాచారం. త‌ద్వారా కొత్త జిల్లాల్లో కూడా క్రియాశీల బాధ్య‌త‌ను కేటీఆర్‌ కు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్తున్నారు. ప్ర‌స్తుతం త‌ల‌నొప్పిగా మారిన సిరిసిల్లా జిల్లా నుంచి కూడా కేటీఆర్‌ కు విముక్తి దొరికిన‌ట్లు అవుతంద‌నేది మ‌రో అంచనాగా వివ‌రిస్తున్నారు.