Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్కెచ్ అర్థం అయితే షాకే

By:  Tupaki Desk   |   7 Feb 2017 5:30 PM GMT
కేసీఆర్ స్కెచ్ అర్థం అయితే షాకే
X
టీఆర్ఎస్‌ అధినేత - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు రాజ‌కీయ వ్యూహాల గురించి మ‌రోమారు చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత త‌న సర్కారు పదవీకాలం సగం పూర్తికావడంతో, 2019 ఎన్నికల్లోనూ అధికార పగ్గాలు చేజిక్కించుకునేలా కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న సాగుతోంద‌ని అంటున్నారు. అయితే ఇందుకు ఒక‌టి రెండు ప్ర‌ణాళిక‌లు కాకుండా భారీ స్థాయిలో గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తిరిగి అధికారంలోకి తీసుకురాగలిగిన స్థాయిలో ఉన్న ఓటు బ్యాంక్‌ పై దృష్టి సారించారని విశ్లేషిస్తున్నారు. ఎస్సీ వర్గాలకు దగ్గరయ్యేందుకు ఎస్సీ వర్గీకరణ - మైనార్టీలకు దగ్గరయ్యేందుకు 12 శాతం రిజర్వేషన్లు - గురుకుల విద్యాసంస్థల ఏర్పాటు - బీసీ సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు మత్స్యకారులు - యాదవుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయింపు, బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. జనాభాలో సగభాగమైన మహిళల కోసం ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశ పెట్టడానికీ కసరత్తు చేస్తోంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఒకవైపు సానుకూలంగా ఉంటూనే, మరోవైపు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ వర్గాలకు షాదీ ముబారక్ పథకం అమలు - మైనార్టీ విద్యార్థులకు ఓవరీస్సిస్ స్కాలర్ షిప్‌ లు కల్పించింది. తాజాగా మైనార్టీలకు ప్రత్యేకంగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం, మసీదుల్లో ఇమామ్, మౌజమ్‌ లకు నెలనెలా రూ.15 వందల పారితోషకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో మైనార్టీ సంక్షేమంపై జరిగిన చర్చ సందర్భంగా ఎంఐఎం పార్టీ చేసిన డిమాండ్లన్నింటికీ కేసీఆర్ అంగీకరించడం ఆస‌క్తిక‌రం! రూ.40 కోట్లతో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. పరిశ్రమల స్థాపనలో మైనార్టీలకు ప్రత్యేక కోటా కేటాయిస్తామన్నారు. అలాగే రాష్ట్ర జనాభాలో 15-16 శాతంగా ఉన్న ఎస్సీ ఓట్లకు గాలం వేయడానికి వర్గీకరణ బిల్లును భుజానికెత్తుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ఇటీవల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎస్సీల సంక్షేమానికి ఇంకా ఏంచేయాలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా, ఎస్టీల సంక్షేమంపై అధ్యయనానికి మంత్రి చందూలాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు రాష్ట్ర జనాభాలో దాదాపు సగం జనాభా కలిగిన వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్ల మెప్పుకోసం కుల వృత్తులపై దృష్టి సారించారు. బీసీల్లో ప్రధానంగా ముదిరాజ్ - యాదవులు - గౌడ్లు ప్రధాన సామాజిక వర్గాలు. ఈ వర్గాల సంక్షేమానికి కుల వృత్తులకు వచ్చే బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల మాదిరిగా బీసీ ఉప ప్రణాళిక ఏర్పాటుకూ ప్రభుత్వం యోచిస్తోంది. మత్స్యకారుల కోసం కాకతీయ మిషన్ కింద పునరుద్ధరించిన చెరువులలో చేపల పెంపకాన్ని ఇప్పటికే ప్రారంభించింది. యాదవ, కురుమ సామాజిక వర్గాల కులవృత్తి గొర్రెల పెంపకానికి బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించడానికి కసరత్తు చేస్తోంది. మహిళల్లో ఇప్పటికే వితంతువులు - వృద్దులు పెన్షన్లు పొందుతుండగా ఒంటరి మహిళలకు ఏప్రిల్ నుంచి పెన్షన్లు కసరత్తు చేస్తోంది. సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇలా సమాజంలో అధిక శాతం ఉన్న సామాజిక వర్గాల అభ్యున్నతికి కొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు కేసీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/