Begin typing your search above and press return to search.

ఇవాంకాకు కేసీఆర్ స‌ర్కారు పెట్టిన ఖ‌ర్చు 100కోట్లు

By:  Tupaki Desk   |   18 Nov 2017 6:14 AM GMT
ఇవాంకాకు కేసీఆర్ స‌ర్కారు పెట్టిన ఖ‌ర్చు 100కోట్లు
X
అతిధులు వ‌స్తున్నారంటే ఎవ‌రికైనా ఆనంద‌మే. కానీ.. అదే అతిధి కార‌ణంగా భారీగా ఖ‌ర్చు భారం ప‌డితేనే అస‌లు ఇబ్బంది అంతా. అప్పు చేసి ప‌ప్పు కూడు మాదిరి.. ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు చేస్తూ.. మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలోనే అర‌వైఏళ్లకు తీసుకున్న రుణానికి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా స‌రికొత్త‌గా అప్పు చేసేయ‌టం తెలిసిందే.

మూడున్న‌రేళ్ల‌లో దాదాపు రూ.60వేల కోట్ల‌కు పైనే అప్పులు చేసిన కేసీఆర్ స‌ర్కారు తీరుపై విప‌క్షాలు మండిప‌డుతుంటే.. బాజాప్తా.. అప్పులు చేస్తామంటూ ఆర్థిక మంత్రి ఈటెల మాష్టారు నిండు అసెంబ్లీలో కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు. తాము ఏమ‌నుకుంటే అదే చేస్తామ‌నే మాట‌ను చెప్పేశారు. త‌మ స‌ర్కారు తీరు ఎలా ఉంటుంద‌న్న విష‌యం తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్ని చూసిన‌ప్పుడు స్ప‌ష్టంగా తెలిసింది.

ఇదిలా ఉంటే.. ఈ నెల 28న స్టార్ట్ అయ్యే బిజినెస్ స‌మ్మిట్ కోసం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హైద‌రాబాద్‌ కు వ‌స్తున్నారు. ట్రంప్ కూతురు కంటే కూడా.. అమెరికా అధ్య‌క్షుడి కుమార్తెగా ఇవాంక‌ను ట్రీట్ చేస్తున్నార‌ని చెప్పాలి. ఈ కార‌ణంగానే హైద‌రాబాద్ లో ఆమె ఎక్క‌డైతే వెళుతుందో అక్క‌డ యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాంకా బ‌స చేసే హోట‌ల్ మొద‌లుకొని.. ఆమె స‌ద‌స్సులో పాల్గొనే ప్రాంతంతో పాటు.. విందు కోసం వెళ్లే ఫ‌ల‌క్ నుమా ప్యాల‌స్‌.. గోల్కొండ ద‌గ్గ‌ర చేస్తున్న ఏర్పాట్లు భారీగా ఉన్నాయి. ఒక్క రోడ్ల కోస‌మే దాదాపు రూ.60 కోట్ల మేర ఖ‌ర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాంకా పర్య‌ట‌న నేప‌థ్యంలో పెడుతున్న ఖర్చు మీద మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల్ని అధికారులు మొద‌లు నేత‌లు ఎవ‌రూ ఖండించ‌లేదు.

ఎప్పుడైతే సోష‌ల్ మీడియాలో ఇవాంకా కోసం చేస్తున్న ఏర్పాట్లు.. అందుకు అవుతున్న ఖ‌ర్చు మీద కామెంట్లు.. విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయో మంత్రి కేటీఆర్ అలెర్ట్ అయ్యారు. తాము ఇవాంకా కోసం ఖర్చు చేయ‌టం లేద‌ని.. ప్ర‌జ‌ల కోసం చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ మాట‌లు నిజ‌మే అనుకుంటే.. ఇవాంకా తిరిగే ప్రాంతాల రోడ్ల‌కే రూ.60 కోట్లు ఎందుకు కేటాయించిన‌ట్లు? ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ వ్యాప్తంగా రోడ్లు దెబ్బ తిన్నాయి. అలాంట‌ప్పుడు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ప‌నులు మొద‌లు కావాలి. కానీ.. మాదాపూర్ కేంద్రంగా మాత్ర‌మే ప‌నులు ఎందుకు జ‌రుగుతున్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలాంటివి క్ర‌మ‌క్ర‌మంగా ప్ర‌భుత్వానికి డ్యామేజ్ చేసేలా మార‌తాయ‌న్న విష‌యాన్ని గుర్తించిన కేటీఆర్‌.. తాము రోడ్ల కోసం చేస్తున్న ఖ‌ర్చు ఇవాంకా కోసం కాద‌ని.. హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల కోస‌మ‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

కేటీఆర్ మాట‌ల్లో అస‌లు విష‌యాన్ని గుర్తించ‌లేని స్థితిలో ప్ర‌జ‌లేమీ లేరు. వారికి తెలియ‌ని విష‌యమంటూ ఏదీ లేదు. ఇవాంకా కోసం రోడ్లు వేయ‌టం లేదు స‌రే.. బ్యూటిఫికేష‌న్ కోసం పెడుతున్న భారీ ఖ‌ర్చు మాటేమిటి. రోడ్ల ప‌క్క‌న పూల‌కుండీలు. మురికి ప‌ట్టిన‌ట్లు ఉండే. ఫ్లైఓవ‌ర్ కింద స్తంభాల‌ను శుభ్రం చేసి ర‌క‌ర‌కాల పెయింటింగ్ లు ఎందుకు వేస్తున్న‌ట్లు? .. చివ‌ర‌కు రోడ్ల ప‌క్క‌నున్న చెట్ల‌కు సైతం రంగులు వేయిస్తున్న తీరు చూస్తే.. భారీ ఏర్పాట్లు ఎవ‌రి కోస‌మ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

ఇవాంకా వ‌స్తున్న వేళ‌.. రోడ్లు.. సుంద‌రీక‌ర‌ణ కోసం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు పెడుతున్న ఖ‌ర్చు ఏకంగా రూ.100 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని.. భ‌ద్ర‌తా నిర్వ‌హ‌ణ మొద‌లు మిగిలిన అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే వంద కోట్ల మార్కును ఇట్టే దాటిపోతుంద‌ని చెబుతున్నారు. ఇవాంకా రావ‌టంతో హైద‌రాబాద్‌ కు జ‌రిగే లాభం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఖ‌ర్చు మాత్రం రూ.100 కోట్ల పైనే కావ‌టం.. అదంతా ప్ర‌జ‌ల జేబుల్లో నుంచి తీసుకునే ప‌న్నులతోనే అన్న‌ది గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడే మ‌న‌సు బాధ‌కు గురి అవుతుంటుంది. ఇలాంటి బాధ‌లు రానున్న రోజుల్లో ఇంకెన్ని ప‌డాల్సి ఉంటుందో?