Begin typing your search above and press return to search.

న్యాయమూర్తులనూ వదలని కేసీఆర్

By:  Tupaki Desk   |   19 March 2016 4:15 PM IST
న్యాయమూర్తులనూ వదలని కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ సెటైర్లు వేయడంలో దిట్ట. ఆయన మాటతీరే విభిన్నం. చురకలు వేస్తూ చురుకుపుట్టిస్తారాయన. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన న్యాయ అధికారుల సదస్సులో పాల్గొన్న ఆయన అక్కడ న్యాయ వ్యవస్థ స్థితిగతులపై మాట్లాడుతూ సుతిమెత్తని చురకలతో సూచనలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ఎందరో దిగ్గజ న్యాయమూర్తులు, చట్టాలను పుక్కిటపట్టిన మేధావులు ఉన్న వేదిక నుంచి ఆయన న్యాయ వ్యవస్థ తీరు మారాలన్న విషయాన్ని నేరుగా కాకుండా ఒక సామెత రూపంలో చెప్పి తన భావాన్ని న్యాయకోవిదులకు అర్థమయ్యేలా చేశారు.

భారతదేశంలో న్యాయం చాలా ఆలస్యం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పెండింగులో ఉన్న లక్షల సంఖ్యలో కేసులే అందుకు తార్కాణం. అంతేకాదు... న్యాయం చాలా ఖరీదుగా కూడా మారిపోయింది. సత్వర న్యాయం, సరసమైన ధరలో న్యాయం అన్నది లేకుండా పోయిందన్నది నగ్న సత్యం. న్యాయవ్యవస్థలో ఉన్నవారు కూడా పలుమార్లు దీన్ని అంగీకరించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పెద్దపెద్ద న్యాయమూర్తుల ఎదుట కేసీఆర్ కూడా అదే చెప్పారు. కేసు ఓడిపోయినవాడు కోర్టులో ఏడిస్తే... గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడని అంటారని... ఆ నానుడిని తుడిచేసేలా న్యాయవ్యవస్థ మారాలని ఆయన తన ప్రసంగంలో అన్నారు. పరిపాలనా వ్యవస్థ - న్యాయ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని సూచించారు. 'తెలంగాణలో ఐదు లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టుల్లో 2.77 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. న్యాయ స్థానానికి వెళ్లినప్పుడు.. న్యాయ మూర్తులు సమర్థవంతంగా పని చేస్తే స్పీడ్ గా ప్రజలకు న్యాయం చేకూరుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్వర న్యాయం అందించాలి. న్యాయ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది.'.. అని కేసీఆర్ అన్నారు.