Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా...బాబు దోస్తుల‌తోనే కేసీఆర్ స్పెష‌ల్ మీటింగ్‌

By:  Tupaki Desk   |   6 May 2019 4:02 PM IST
గ‌మ‌నించారా...బాబు దోస్తుల‌తోనే కేసీఆర్ స్పెష‌ల్ మీటింగ్‌
X
దేవేగౌడ‌, మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ ర‌థ‌సార‌థి, కుమార‌స్వామి, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి, జేడీఎస్ నేత‌. స్టాలిన్‌. త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత‌. డీఎంకే ర‌థ‌సార‌థి. ఈ ఇద్ద‌రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు పొరుగున ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు!!. అయితే, ఇటీవ‌లే ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన అనంత‌రం త‌న కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనలో భాగంగా కేసీఆర్ ప‌ర్య‌టిస్తుండ‌టం స‌హ‌జంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు, క‌ర్ణాట‌క‌ పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌ తో ఫోన్లో మాట్లాడారు. త్వ‌ర‌లో స‌మావేశం అవుదామంటూ పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ తో ఆయన నివాసంలో సమావేశమవుతారు. దేశ రాజకీయాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికలు, తదనంతరం తలెత్తే పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అయితే, కేరళ, తమిళనాడు, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నాయ‌కుల‌తో స‌మావేశం అవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌ధాన పార్టీలుగా డీఎంకే, జేడీఎస్ గెలుపు కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేశారు. క‌ర్నాట‌క‌లోని మండ్య‌లో ముఖ్య‌మంత్రి కుమారస్వామి త‌న‌యుడు నిఖిల్ విజ‌యం కోసం బాబు ప్ర‌చారం చేశారు. త‌మిళ‌నాడులోనూ చంద్ర‌బాబు డీఎంకే గెలుపు కోసం కృషి చేశారు. ఈ త‌రుణంలో ఆ ఇద్ద‌రి నేత‌ల‌తో దోస్తీకి కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తుండ‌టం...కేసీఆర్ ప్ర‌క‌టించిన రిట‌ర్న్ గిఫ్ట్‌ లో భాగ‌మా లేక‌పోతే బాబుతో దోస్తీ ఉన్న నేత‌ల మ‌ధ్య చీలిక తేవ‌డమా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.