Begin typing your search above and press return to search.

చారిత్రక ఒప్పందంతో కలిగే లాభాలేంటో..?

By:  Tupaki Desk   |   9 March 2016 4:29 AM GMT
చారిత్రక ఒప్పందంతో కలిగే లాభాలేంటో..?
X
తెలంగాణ.. మహారాష్ట్ర సర్కార్ల మధ్యన చారిత్రక ఒప్పందం ఒకటి విజయవంతంగా పూర్తి అయ్యింది. గోదావరి మీద తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించి.. తెలంగాణకు పక్కనే ఉన్న మహారాష్ట్ర సర్కారుతో తాజాగా ఒప్పందం కుదుర్చుకోవటం తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి కలిగే లాభం ఎంతన్నది ఆసక్తికరం. మరి.. ప్రాజెక్టుల వారీగా లాభాల లెక్కల్లోకి వెళితే..

ప్రాణహిత లెక్క ఇదే..

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా అదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే మార్గంలో 56,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే వీలు కలిగితే తాజా ఒప్పందం పుణ్యమా అని అది రెండు లక్షల ఎకరాలకు పెరగనుంది.

లోయర్ పెనుగంగ ప్రాజెక్టుతో..

మహారాష్ట్ర.. తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించే లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు తో వాడుకునే నీటిలో మహారాష్ట్ర వాటా 88 శాతమైతే.. తెలంగాణ వాటా 12 శాతం. ఈ ప్రాజెక్టుతో 5.1 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకునే వీలుంది.

కాళేశ్వరంతో లాభమిదే..

రీడిజైన్ లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించే మేడిగడ్డ బ్యారేజి నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి 14.4 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్నది ఒక లక్ష్యం. ఇదే కాదు.. పరిశ్రమలకు.. తాగు నీటి అవసరాల్ని తీర్చాల్సి ఉంది.

లెండి ప్రాజెక్టుతో..

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన లెండిని మహారాష్ట్ర సర్కారు నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర వాటా 68 శాతం. తెలంగాణది 32 శాతం. రెండు టీఎంసీల నీటిని వినియోగించుకొని 22వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది తాజా ప్రయత్నం.

చనాఖా-కొరటాతో ఆ జిల్లాకు కలిగే ప్రయోజనం..

ఇది కూడా రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. కాకుంటే తెలంగాణ వాటా అత్యదికం. 80శాతం తెలంగాణ వాటా ఉన్న ఈ ప్రాజెక్టులో మహారాష్ట్రది కేవలం 20శాతమే. బ్యారేజీ నుంచి ఎత్తిపోతల ద్వారా 13,500 ఎకరాలు.. గ్రావటీ ఆధారంగా 37,500ఎకరాలు కలిపి.. మొత్తంగా 51వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదంతా వెనుకబడిన జిల్లాగా పేరున్న అదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం కలుగనుంది.

పెన్ గంగపై మరో రెండు బ్యారేజీలతో..

పెన్ గంగ పై రెండు బ్యారేజీలను నిర్మిస్తున్నారు. ఈ రెండింటిని మహారాష్ట్ర సర్కారే నిర్మిస్తోంది. రాజుపేట వద్ద బ్యారేజీని 0.7 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు. నీటి వినియోగం రెండు రాష్ట్రాలకు సమానంగా ఉంటుంది. దీంతో.. అదిలాబాద్ జిల్లాలోని 3500 ఎకరాల ఆయుకట్టు లబ్థి పొందుతుంది. అదే విధంగా పంపరాడ్ బ్యారేజీకి సంబంధించి మహారాష్ట్రకు 70శాతం వాటా ఉంది. దీని కింద 1.2 టీఎంసీల నీటి వాటా లభిస్తుంది. దీని వల్ల కూడా అదిలాబాద్ జిల్లా లబ్థి పొందనుంది.