Begin typing your search above and press return to search.

ఈట‌ల‌కు షాకిచ్చిన కేసీఆర్‌.. ఫ‌లించిన వ్యూహం!

By:  Tupaki Desk   |   28 July 2021 7:00 AM IST
ఈట‌ల‌కు షాకిచ్చిన కేసీఆర్‌.. ఫ‌లించిన వ్యూహం!
X
ప్ర‌త్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ కు టీఆర్ఎస్ భారీ షాకిచ్చింది. ఈట‌ల‌కు వెన్నంటి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో కొంద‌రిని ఇప్ప‌టికే న‌యానో భ‌యానో త‌మ‌వైపు తిప్పుకున్న అధికార పార్టీ.. ఇప్పుడు మ‌రొక కీల‌క ప్ర‌జాప్ర‌తినిధిని లాగేసుకుంది. ఈట‌ల రాజీనామా త‌ర్వాత నుంచి రంగంలోకి దిగిన మంత్రి గంగుల‌.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. మ‌రొక‌రిని కారెక్కించుకున్నారు.

హూజూరాబాద్ తో ఈట‌ల బంధం ఈనాటిది కాదు. రెండు ద‌శాబ్దాల నాటిది. 2001లో తెలంగాణ రాష్ట్ర‌స‌మితి పురుడుపోసుకున్న నాడు కేసీఆర్ వెంట ఉన్న పిడికెడు మందిలో ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్ లో, తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చారు. నాటి నుంచి హుజూరాబాద్ తో ఆయ‌న అనుబంధం పెరుగుతూ వ‌చ్చింది. అందుకే.. ప‌లుమార్లు ఆయ‌న‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే.. ఈట‌ల గెలిచిన త‌ర్వాత త‌న‌దారి తాను చూసుకోలేదు. కేడ‌ర్ ను వెన్నంటి ఉన్నారు. వారి సాద‌క‌బాధ‌కాల్లో భాగ‌మ‌య్యారు. అందుకే.. భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లు చేసినా, మంత్రివ‌ర్గం నుంచి ఆయ‌న్ను తొల‌గించినా.. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గంలోని 90 శాతం మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న వెంట నిల‌బ‌డ్డారు. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం.. మంత్రి గంగుల‌ను రంగంలోకి దించింది. ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టిన మంత్రి గంగుల.. ఈట‌ల బ‌లం త‌గ్గించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అయితే.. తాజాగా ఈట‌ల అనుచ‌రులుగా ఉన్న జ‌మ్మికుంట మునిసిప‌ల్ వైఎస్ చైర్ ప‌ర్స‌న్‌ దేశినేని స్వ‌ప్న‌, ఆమె భ‌ర్త‌, ఇల్లంద‌కుంట రామాల‌య మాజీ చైర్మ‌న్ కోటి తిరిగి గులాబీ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈట‌ల‌తో క‌లిసి వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి టీఆర్ఎస్ లోనే కొన‌సాగుతామ‌ని ఆ దంప‌తులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఒక లేఖ‌ను కూడా వారు విడుద‌ల చేశారు. కాగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాయ‌భారంతోనే ఈ మార్పు జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ సోద‌రి, కోటి సోద‌రి కుటుంబాల మ‌ధ్య బంధుత్వం ఉంది. ఈ నేప‌థ్యంలోనే మంత్రి రంగంలోకి దిగి లెక్క‌లు స‌రిచేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.