Begin typing your search above and press return to search.

అందరికి షాకిస్తూ.. కౌశిక్ రెడ్డి ఇష్యూలో కేసీఆర్ ట్విస్టు

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:46 AM GMT
అందరికి షాకిస్తూ.. కౌశిక్ రెడ్డి ఇష్యూలో కేసీఆర్ ట్విస్టు
X
మాస్టర్ మైండ్ అన్న బిరుదు ఉన్నప్పుడు.. దానికి తగ్గట్లే ఉండాలే కానీ.. అందరి అంచనాలకు తగ్గట్లు ఎత్తులు వేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి? ఈటలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాక.. ఆయన్నుబయటకు పంపటం.. ఆయన స్థానంలో మరో నేతను తయారు చేసుకోవటం కష్టమన్న విషయం తెలియంది కాదు. వ్యూహాత్మకంగానే ఈటల ఎగ్జిట్ జరిగింది కాబట్టి.. అందుకు తగ్గట్లే ఆయనకు ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై గులాబీ బాస్ ముందే ఆలోచించి ఉంటారు.
ఈటలకు చెక్ చెప్పటానికి ‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకానికి ప్లాన్ చేసిన కేసీఆర్.. అందుకు తగ్గట్లు ఏం చేయాలనే దానిపై బోలెడంత కసరత్తు చేయటమే కాదు.. ఎవరూ ఊహించని ట్విస్టు ఇవ్వటానికి సిద్ధమయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగా ఆయన నుంచి కీలక ప్రకటన వెలువడింది. హుజూరాబాద్ టికెట్ ను మాజీ కాంగ్రెస్ నేత.. యువకుడైన పాడె కౌశిక్ రెడ్డికి ఇవ్వట్లేదన్న విషయంతో పాటు.. ఆయనకు ఎమ్మెల్సీగా నియమిస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

దీంతో.. కౌశిక్ రెడ్డి ఎన్నికల జంఝాటం ఏమీ లేకుండానే శాసన మండలిలోకి అడుగు పెట్టనున్నట్లుగా చెప్పాలి. దీంతో.. హుజూరబాద్ ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ ప్లానింగ్ వేరేలా ఉందన్న విషయం తాజాగా స్పష్టమైంది. సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరుగుతున్న వేళ.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన రావటం.. ఆ సందర్భంగా కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడిన కేసీఆర్.. ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు.

అది కూడా ఎప్పుడో కాదు.. రాత్రికి రాత్రే మాట్లాడతామని.. గవర్నర్ తో మాట్లాడి ఆయన్ను నామినేట్ చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గులాబీ కారు దూసుకెళ్లటానికి కేసీఆర్ తన దగ్గర వేరే ప్లాన్ ఉందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కౌశిక్ రెడ్డి.. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కాస్త అటు ఇటుగా పార్టీలో చేరారని చెప్పాలి. ఈ సందర్భంగా ఇద్దరికి మంచి పదవులు లభిస్తాయన్న మాట కేసీఆర్ నోటి నుంచి రావటం తెలిసిందే.

కౌశిక్ రెడ్డితో పోలిస్తే.. ఎల్ రమణ జాయినింగ్ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయనకు తగిన పదవి ఇస్తామని చెప్పారు. సీనియర్లు పార్టీలోకి వచ్చే సందర్భంలో కేసీఆర్ నోటి నుంచి అలాంటి ప్రకటన రావటం.. వారికి సరైన పదవులు దక్కకపోవటం తెలిసిందే. ఎల్. రమణ విషయంలోనూ అలానే జరగబోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. అందుకు తగ్గట్లే కేసీఆర్ తాజా నిర్ణయం ఉండటం గమనార్హం. కౌశిక్ రెడ్డి రాత్రికి రాత్రి ఎమ్మెల్సీని చేయటానికి సీఎం కేసీఆర్ డిసైడ్ కాగా.. అదే సమయంలో ఎల్ రమణ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటం గమనార్హం.

ఇంతకూ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని ఎందుకు చేస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉప ఎన్నికల్లో తనకే టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో టేపు లీక్ కావటం తెలిసిందే. ఇది కాస్తా పెను సంచలనంగా మారింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమవుతుండగా.. పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా మెడలో వేయించుకున్నారు. కౌశిక్ చెప్పినట్లే టీఆర్ఎస్ లో చేరటం.. తానే అభ్యర్థినన్న ధీమాను వ్యక్తం చేయటం బాగానే ఉన్నా.. పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తానేం చేయనున్న విషయాన్ని చెప్పిన నేపథ్యంలో.. ఆయన్ను బరిలోకి దించితే.. ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయంతోనే ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే.. కొత్త తలనొప్పులు తప్పవన్న ఆలోచనతో పాటు.. ఎవరికి అర్థం కాని మాస్టర్ ప్లాన్ వేసే కేసీఆర్.. మరోసారి తన ఎన్నికల ఎత్తులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసేలా కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ నడిచిందని చెప్పక తప్పదు.