Begin typing your search above and press return to search.

రూ.2వేల నోటుపై కేసీఆర్ షాకింగ్ మాట

By:  Tupaki Desk   |   29 Nov 2016 4:02 AM GMT
రూ.2వేల నోటుపై కేసీఆర్ షాకింగ్ మాట
X
గడిచిన రెండు వారాల వ్యవధిలో ప్రధాని మోడీని మూడుసార్లు కలిసిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను చెప్పొచ్చు. తన చేతిలోకి కేసీఆర్ చెయ్యి తీసుకొని మరీ సన్నిహితంగా మాట్లాడిన ప్రధాని తీరుపై రాజకీయ వర్గాల్లో చాలానే చర్చ సాగుతోంది. నోట్ల రద్దు నేపథ్యంలో పలువురు ప్రముఖులతో చర్చల మీద చర్చలు జరిపి ఒక నివేదికను తయారు చేసి..సూచనల రూపంలో ప్రధానికి కేసీఆర్ అందించిన వైనాన్నిమర్చిపోలేం.

ఇలా రద్దు అనంతరం మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో మోడీతో మాట్లాడిన ఆయనకు.. ప్రధాని తన ఆలోచనల్ని ఎంతోకొంత పంచుకునే ఉంటారన్న భావన ఉంది. దీనికి తగ్గట్లే రద్దుపై కేసీఆర్ టోన్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుందని.. తగ్గిన ఆదాయం మేరకు రాష్ట్రాలకు కేంద్రం సర్దుబాటు చేయాలన్న డిమాండ్ చేసిన ఆయన నోటి నుంచి తాజాగా వస్తున్న మాటలు వింటుంటే షాకింగ్ గా ఉంది. మరీ.. ముఖ్యంగా రూ.2వేల నోటు గురించి ఆయన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి.

దేశంలో మరే ముఖ్యమంత్రి చెప్పని రీతిలో కేసీఆర్ నోటి నుంచి రూ.2వేల నోటు గురించి కామెంట్స్ రావటం గమనార్హం. భవిష్యతులో రూ.2వేల నోటు ఉంటుందో.. లేదో చెప్పలేమని.. భవిష్యత్తులో దాన్ని కూడా రద్దు చేయొచ్చని.. ఇది కేంద్రం వ్యూహంలో భాగం కావొచ్చంటూ చెప్పిన మాటలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. అంతేకాదు.. భవిష్యత్తులో ఆదాయపన్ను ఉండే అవకాశం లేదని ఆయన చెప్పటం మరో సంచలనంగా చెప్పొచ్చు. రాష్ట్రాల ఆదాయం భారీగా పెరుగుతుందని.. ఇప్పుడొస్తున్న ఆదాయానికి ఆరేడు రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెబుతున్న కేసీఆర్.. అదెలా వస్తుందన్న విషయాన్ని చెప్పేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం దేశంలో ఒక్క శాతం మందే ఆదాయపన్ను కడుతున్నారని.. వారిలో ఉద్యోగులు ఎక్కువని.. దానికి బదులుగా జీఎస్టీ.. బీటీటీ (బ్యాంకు ట్రాన్సాక్షన్) రెండే పన్నులు అమలు చేసే వీలుందని కేసీఆర్ చెబుతున్నారు. అలా జరిగితే కేంద్రానికి వచ్చే ఆదాయం భారీగా పెరిగే వీలుందంటున్నారు.

రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే.. రాష్ట్రాలకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బగా అభివర్ణించిన కేసీఆర్.. మూడు వారాల వ్యవధిలో తన మాట తీరును మొత్తంగా మార్చేసుకున్న తీరు ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ పడుతుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేయగా.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా భవిష్యత్తు దివ్యంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషంగా చెప్పాలి.

రానున్న రోజుల్లో రాష్ట్రాల ఆదాయం ఎలా పెరుగుతుందో ఉదాహరణతో సహా కేసీఆర్ చెబుతున్నారు. కేంద్ర పన్నుల వాటాలో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తారని.. ఇలా ప్రతి ఏటా రూ.13వేల కోట్లు.. నెలకు దాదాపు రూ.997 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పిన ఆయన.. ‘‘ప్రస్తుత నిర్ణయంతో ఆదాయం తగ్గుతుంది. ఎంతమేర అన్నది ఇప్పుడేచెప్పలేం.తెలంగాణ మొత్తంలో రూ.75వేల కోట్ల మారద ద్రవ్యం చెలామణీలో ఉంటే.. అందులో 80 శాతం రూ.వెయ్యి.. రూ.500 నోట్లే. ఇప్పుడవన్నీ రద్దు చేయటంతో లావాదేవీలు స్తంభించి..రాష్ట్ర ఆదాయం మీద ప్రభావం చూపించటం ఖాయం. రాష్ట్రంలో బ్యాంకు ఖాతాల్లో రూ.32 వేల కోట్లు నిధులు జమ కాగా.. రూ.12వేల కోట్లు పంపిణీ అయ్యాయి. దీంతో చిల్లర నోట్ల సమస్య బయటకు వచ్చింది’’ అని ఆదాయం ఎలా తగ్గిందో చెప్పారు.

అయితే.. ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా.. కేంద్రం తీసుకునే నిర్ణయాల కారణంగా రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందన్న ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్న తీరు చూస్తే.. ఆయనకు మోడీ ఫ్యూచర్ ప్లాన్ పై ఎంతో కొంత ఫీడ్ బ్యాక్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. రూ.2వేల నోటుపై కేసీఆర్ మాట ఉలిక్కిపడేలా చేసిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/