Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ దెబ్బకు మరో వికెట్ ఫట్

By:  Tupaki Desk   |   4 March 2022 4:10 AM GMT
గులాబీ బాస్ దెబ్బకు మరో వికెట్ ఫట్
X
ఒక్కో మెటల్ కు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద కరిగే గుణం ఉంటుంది. అలానే ఎవరైనా సరే.. ఒక్కో ఫ్రీక్వెన్సీతో కనెక్టు అవుతారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంది. అదే.. ఆయన మాటలు. తాను చెప్పే మాటలకు ఎంతటి వాడినైనా కన్వీన్స్ చేసే సమ్మోహక శక్తి ఉంటుంది. ఇక.. ఆయన మనసు పెట్టి ఎవరినైనా లంచ్ కు పిలిస్తే.. అది పూర్తయ్యేసరికి.. సదరు వ్యక్తి ఎవరైనా కావొచ్చు.. వారి భేటీ పాజిటివ్ గా ముగుస్తుందన్న మాట వినిపిస్తుంటుంది. ఇప్పుడా మాటలో నిజం ఉందన్న భావన కలిగే పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్.. గురువారం మధ్యాహ్నం లంచ్ భేటీకి రైతు నాయకుడు.. ప్రధాని నరేంద్రమోడీ లాంటి నేతకు తన ఉద్యమంతో చుక్కలు చూపించిన రాకేశ్ తికాయత్ ను లంచ్ కు పిలిచారు. ఆయనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారనుకోండి. దాదాపు గంటన్నర పాటు సాగిన లంచ్ భేటీలో కేసీఆర్ మాటలకు.. రాకేశ్ తికాయత్ ఫిదా అయినట్లుగా చెబుతున్నారు.

తమ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పథకాలు.. విధానాల విషయంపై కేసీఆర్ చెప్పిన మాటలకు రాకేశ్ తికాయత్ ఫిదా కావటమే కాదు.. ఈ భేటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తెలంగాణలో అనుసరిస్తున్న రైతుబంధు విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న మాట చెప్పారంటే.. ఆయన మాటలు రైతు నాయకుడి మీద ఎంతలా ప్రభావితం చేశాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టార్గెట్ చేసిన చందంగా.. ఆచితూచి అన్నట్లు ఎంపిక చేసిన వారిని భేటీ కావటం.. వారికి తన వాదనను వినిపించి.. కన్వీన్స్ చేయటంలో కేసీఆర్ సక్సెస్ అవుతుంటారు.

ఆ మధ్యన హైదరాబాద్ వచ్చిన రాకేశ్ తికాయత్.. కేసీఆర్ సర్కారు తీరుపైన విమర్శలు సంధించారు. అప్పట్లో ఆయన్ను వామపక్ష వాదులు హైదరాబాద్ కుతీసుకురావటం తెలిసిందే. తనకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాకేశ్ తికాయత్ కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడితే.. తాజాగా సీఎమ్మే స్వయంగా కూర్చొబెట్టుకొని.. విందు ఆరగిస్తూ.. తన విధానాలు.. తన లక్ష్యాలు.. తన ప్యూచర్ ప్లాన్ మీద చెప్పిన మాటలతో రాకేశ్ తికాయత్ కన్వీన్స్ అయినట్లేనని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ సమ్మోహకర మాటలు.. మరో పెద్ద మనిషిని ఫిదా అయ్యేలా చేశాయని చెప్పాలి. మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జట్టును అంతకంతకూ పెంచుకునే ప్రయత్నంలో మరో అడుగు ముందుకు వేశారని చెప్పక తప్పదు.