Begin typing your search above and press return to search.

పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికకు సీక్రెట్ సర్వేనా కేసీఆర్?

By:  Tupaki Desk   |   2 Sep 2021 7:30 AM GMT
పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికకు సీక్రెట్ సర్వేనా కేసీఆర్?
X
ప్రాక్టికల్ గా ప్రజల్లోనూ.. పార్టీలోనూ పట్టు ఎంతన్నది ఇప్పుడు ముఖ్యమే కాదు.. ఆ మాటకు వస్తే వాస్తవాల సంగతి ఎలా ఉన్నా.. తాను చేయించే సీక్రెట్ సర్వేలో మొనగాడన్న మాట వస్తేనే.. పదవులు ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ఇష్టపడుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా అలాంటి పరిస్థితే మహబూబాబాద్ జిల్లా పార్టీలో నెలకొని ఉందంటున్నారు. సర్వేల మీద ఆధారపడటం తప్పేం కాదు కానీ.. రిపోర్టే.. అంతిమ నిర్ణయంగా ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

అప్పటికే ఉన్న అవగాహనకు సర్వే రిపోర్టు అన్నది ఆధారం కావాలే తప్పించి.. సర్వే రిపోర్టు ఆధారంగా అవగాహన కల్పించుకోవటం ఎప్పటికైనా దెబ్బేనన్న మాట వినిపిస్తోంది. ప్రజల్లో పరపతి.. పార్టీ మీద పట్టు ఉండొచ్చు. కానీ.. జిల్లా పార్టీ నేతల్ని కలుపుకుపోయే తత్త్వం లేకుంటే.. జరిగే నష్టం మాటేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. ప్రస్తుతం మహబూబాబాద్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కోసం రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. తెర మీద పలువురి పేర్లు ఉండటం.. అందరు తమకు మించిన తోపులు లేరన్నట్లుగా చెబుతున్న వేళ..తీసుకునే నిర్ణయం శాస్త్రీయంగా ఉండాలన్న భావనతో కొత్త తరహా కసరత్తును షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఫైనల్ చేయాలనే దానికి పలువురు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వీరిలో మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌ రెడ్డి, మార్నేని వెంకన్న పేర్లను స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎంపీ మాలోత్ కవిత కూడా తమ అనుచరులకు పదవుల్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారని.. అధినాయకత్వం దగ్గర తకున్న చనువుతో తన వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు ఇప్పించుకోవాలని ఆమె భావిస్తున్నారట. ఇందులో భాగంగా మహబూబాబాద్‌ మండలానికి చెందిన కేఎస్ఎన్‌రెడ్డి, ముత్యం వెంకన్న పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇలా ఎవరికి వారు తమ వారికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో.. సీక్రెట్ సర్వేకు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల వేళలోగెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసేందుకు సీక్రెట్ సర్వేను నిర్వహించటం తెలిసిందే అయినా.. ఇప్పుడు జిల్లా పార్టీ నాయకత్వ ఎంపికకు రహస్య సర్వేలు చేయించటమా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి పదవులు సర్వే రిపోర్ల ఆధారంగా ఇస్తారా? అన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. దీనిపై గులాబీ నేతలు కాస్తంత గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.