Begin typing your search above and press return to search.

రూ.5వేల కోట్ల కోసం కేసీఆర్ భారీ ప్లానింగ్

By:  Tupaki Desk   |   7 Jan 2020 12:05 PM IST
రూ.5వేల కోట్ల కోసం కేసీఆర్ భారీ ప్లానింగ్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట తరచూ సంపన్న రాష్ట్రమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే.. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ధనిక రాష్ట్రమన్న బడాయి అస్సలు వినిపించటం లేదు. కారణం.. తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో రాష్ట్ర కూరుకుపోవటమే. ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు పెట్టటం.. అందినకాడికి అప్పులు తెచ్చేసి ప్రభుత్వ బండిని నడిపిన కేసీఆర్ కు.. అనుకోని రీతిలో వచ్చి పడిన ఆర్థిక మాంద్యం ఇప్పుడో పెద్ద తలనొప్పిగా మారింది.

దీంతో.. ఆయన వేసుకున్న అంచనాలన్ని తలకిందులయ్యాయి. భారీ ఆదాయం వస్తుందనుకుంటే..మాంద్యం కారణంగా రెగ్యులర్ గా వచ్చే ఆదాయం కూడా రాని పరిస్థితి. దీంతో.. ఇప్పుడు ఆదాయ మార్గాల కోసం ఆయన విపరీతంగా వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ మహానగర శివారుల్లోని అసైన్డ్ భూముల లెక్క తీసిన ప్రభుత్వం.. వాటిని అమ్మటం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం.. కందుకూరు.. శంషాబాద్.. గండిపేట మండలాల పరిధిలోని ఆరు గ్రామాల్లో అసైన్డ్.. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఒక జాబితాను తయారు చేసింది.

ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం ఆరు గ్రామాల్లో 1636 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.5745 కోట్ల వరకూ రావొచ్చన్నది అంచనా. ఇందులో గండిపేట మండలం పుప్పాలగూడకు చెందిన 188 ఎకరాల ద్వారా ఏకంగా రూ.3384 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీ ఎత్తున ఆదాయం వస్తే.. .ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యలు కొన్ని తీరుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం త్వరలోనే భారీగా భుముల్ని అమ్మాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఉన్న నిధుల కొరత కొంతమేర తీరే అవకాశం ఉంది.