Begin typing your search above and press return to search.

సూదిని చూస్తే కేసీఆర్ కు భ‌యం.. మ‌రి, వ్యాక్సిన్ తీసుకుంటారా?

By:  Tupaki Desk   |   2 March 2021 8:30 AM GMT
సూదిని చూస్తే కేసీఆర్ కు భ‌యం.. మ‌రి, వ్యాక్సిన్ తీసుకుంటారా?
X
ఇప్పుడు దేశంలో రెండో విడ‌త వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తులు, 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి తొలి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 70 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకుంటారా? లేదా? అన్న విష‌యం హాట్ టాపిక్ గా మారింది.

రాజ‌కీయాల్లో త‌న‌దైన దూకుడుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు కేసీఆర్‌. ఇచ్చిన‌ మాట నెర‌వేర్చక‌పోతే త‌ల న‌రుక్కుంటా.. నాలుక కోసుకుంటా వంటి శ‌ప‌థాలు కూడా చేసేస్తుంటారు. కానీ.. వ్య‌క్తిగ‌త‌ జీవితానికి వ‌స్తే ప‌రిస్థితి వేరేలా ఉంటుంది. కేసీఆర్ కు సూది మందు అంటే చాలా భ‌యం అని చెబుతుంటారు. ఏదైనా అనారోగ్యం వ‌చ్చినా.. ట్యాబ్లెట్లు, సిర‌ప్ ల‌తోనే త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటార‌ని స‌మాచారం. ఇంజెక్షన్ చేయాల్సి వస్తే మాత్రం.. ఆయ‌న భ‌య‌ప‌డుతుంటార‌ని చెబుతుంటారు.

మ‌రి, సూదిని చూస్తేనే దూరంగా ఉండే కేసీఆర్‌.. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారా? లేదా? అనే చ‌ర్చ మొద‌లైంది. అరవై ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. మ‌రి, ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల్సిన ముఖ్య‌మంత్రి.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ లో భాగంగా.. ఇప్ప‌టికే ప్రధాని మోడీతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా టీకా వేయించుకున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రముఖులు పెద్దగా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్ ను అంత సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రి, ఫైన‌ల్ గా కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.