Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే ఫిగర్ ఎంతో చెప్పేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   4 Oct 2020 1:00 PM IST
గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే ఫిగర్ ఎంతో చెప్పేసిన కేసీఆర్
X
చాలా రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరి ఎన్నికలకు ముందే.. ఫలితాల గురించి జోస్యం చెప్పేయటం.. అందుకు తగ్గట్లే ఫలితాలు రావటం కనిపించదు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పిన ఎన్నికల ఫలితాల జోస్యం దెబ్బేసింది కానీ.. మిగిలినవన్నీ ఆయన అంచనాలకు తూచా తప్పలేదు.

తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు.. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దీంతో.. సీఎం కేసీఆర్ మొదలు పార్టీ మొత్తం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయింది. గడిచిన రెండు వారాలుగా ఇదే అంశంపై భారీ ఎత్తున కసరత్తు జరుగుతోంది. తాజాగా పార్టీకి చెందిన మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశం ఏదైనా కానీ కనీసం ఐదారు గంటలకు తగ్గకుండా నిర్వహించే కేసీఆర్.. తాజా సమావేశాన్ని సైతం ఆరు గంటల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో రానున్న ఎన్నికల గురించి.. వాటి సన్నద్ధత ఎలా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రజల్లోకి వెళ్లే సమయంలో ఏమేం విషయాల్ని ప్రస్తావించాలన్న విషయంతో పాటు.. ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందన్న అంశంపైనా సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

కేంద్రం నుంచి వచ్చే ఒత్తిడిని సైతం తాను ఎలా ఎదుర్కొన్నది చెప్పటంతో పాటు.. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయాల్ని నేతలతో పంచుకున్నారు. పెద్దనోట్ల రద్దు.. జీఎస్టీ అమలు సమయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రమే మద్దతు ఇచ్చిందని.. కానీ తాము చేసిన సాయాన్ని కేంద్రం గుర్తు పెట్టుకోలేదని కేసీఆర్ పేర్కొన్నారు.

మొత్తంగా కేంద్రంతో పోరాటం తప్పించి మరో మార్గం లేదని.. అన్ని చట్టాల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని.. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. అధికారుల్ని తన అధీనంలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తుందని చెప్పటం ద్వారా.. జాతీయ రాజకీయాల దిశగా తాను అడుగులు వేయనున్న సంకేతాల్ని ఇచ్చినట్లైంది. ఇక.. దుబ్బాకలో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని.. పట్టభద్రుల ఎన్నికలో పార్టీ నేతలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. అందులోనూ తమదే విజయమని తేల్చారు.

ఇక.. కీలకమైన గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి వచ్చే సీట్ల లెక్కను చెప్పేశారు. ఈసారి ఎన్నికల్లో 104 స్థానాలకు ఏ మాత్రం తగ్గదని.. గ్రేటర్ మీద గులాబీ జెండా రెపరెపలాడుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు.. వరంగల్.. ఖమ్మం మునిపిసల్ కార్పొరేషన్ లోనూ టీఆర్ఎస్ గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు.. పార్టీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాగా పని చేయాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతల్ని అప్పగిస్తామని చెప్పారు. మరి.. కేసీఆర్ చెప్పిన డివిజన్ల స్కోర్ లెక్కలో వాస్తవం ఎంతన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.