Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఆస్తుల విలువెంతో చెప్పిన కేసీఆర్.. వెయ్యి కోట్ల మార్క్ చేరిందిగా..?

By:  Tupaki Desk   |   28 April 2022 5:30 PM GMT
టీఆర్ఎస్ ఆస్తుల విలువెంతో చెప్పిన కేసీఆర్.. వెయ్యి కోట్ల మార్క్ చేరిందిగా..?
X
2001 ఏప్రిల్ 27.. జల ద్రశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం.. అప్పటి పరిస్థితుల్ల్లో కనీసం ఎవరికీ ఊహ కూడా లేదు. సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్న కె.చంద్రశేఖర రావు సాహసమే చేస్తున్నారని అంతా అనుకున్నారు. ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పెద్ద లక్ష్యాన్ని ఎత్తుకున్నారని భావించారు. కానీ, కేసీఆర్ వెరవలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి ఎందరినో ప్రారంభ రోజుల్లో కలుపుకెళ్లారు. దాదాపు అదే ఏడాదిలో వచ్చిన స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపారు. అటువైపు కేసీఆర్.. సిద్దిపేట నుంచి ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు.. యూపీఏ కనీస ఉమ్మడి అవగాహనలో తెలంగాణ ప్రస్తావన.. ఇతర పరిణామాలు కాలానుగుణంగా జరిగిపోయాయి.

సొంత భవనానికి ఏళ్లు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్ 2004లో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఈ గెలుపునకు కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది. పొత్తులో భాగంగా నాడు కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీచేసి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. ఇక ఈ సమయంలోనే అంటే.. దాదాపు 2005-06లో టీఆర్ఎస్ పార్టీకి భవన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది. దీనిపైనా కొంత చర్చలు జరిగాయి అప్పట్లో. అలా.. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నం.12లో స్థలం పొందిన టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ ను అత్యద్భుతంగా నిర్మించింది. బహుశా రాష్ట్రంలో వారి పార్టీకంటూ ఏర్పడిన తొలి ఆస్తి ఇదేనేమో.? జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నా.. అవి చాలావరకు ప్రైవేటు భవనాల్లో కొనసాగినవే. ఉద్యమ ప్రాబల్యం లేని ఖమ్మం వంటి జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు చాలా అప్రాధాన్యంగా ఉండేవి. ఇదంతా గతం .

వాస్తవంలోకి వస్తే..

ప్రస్తుతం ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ కు సొంత కార్యాలయాలు దాదాపుగా సమకూరాయి. చిత్రమేమంటే.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కాక, కొత్త జిల్లా కేంద్రాల్లోనూ సొంత భవనాలతో కార్యాలయాలను స్థాపించింది ఆ పార్టీ. దీనికితోడు, దేశ రాజధాని ఢిల్లీలో రూ.8.50 కోట్లు పెట్టి స్థలాన్ని కొనుక్కుని, ఇంకో రూ.8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్‌ను కడుతున్నారు. 6,7 నెలల్లో ఈ కార్యాలయం ఏర్పాటు కాబోతోంది.

పార్టీకి రూ.451 కోట్లు ఫిక్స్‌డ్‌డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఎలక్ర్టోరల్‌ బాండ్స్‌ ప్రకారం ఉన్న నిధులు రూ.865 కోట్లు. స్టేట్‌బ్యాంక్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పారదర్శకంగా నిధులను పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాం. హైదరాబాద్‌, ఢిల్లీ, జిల్లా కార్యాలయాలను కలుపుకుని పార్టీకి మొత్తంగా రూ.1000 కోట్ల వరకు ఆస్తులున్నాయి.

అధినేత కేసీఆరే చెప్పారు..

కేసీఆర్ బుధవారం నాటి ప్లీనరీలో చెప్పినదాని ప్రకారం టీఆర్ఎస్ ధనిక పార్టీగా ఎదిగింది. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, డీఎంకే తరహాలో కోటీశ్వరుల పార్టీగా మారింది. 22వ సంవత్సరంలోకి అడుగుపెట్టని టీఆర్ఎస్ కు 60 లక్షల మంది సభ్యులున్నారు.