Begin typing your search above and press return to search.

కేసీఆర్ నగరానికి వచ్చేశారోచ్

By:  Tupaki Desk   |   7 Nov 2015 12:45 PM IST
కేసీఆర్ నగరానికి వచ్చేశారోచ్
X
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధానిలో ఉండటం మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన రాజధానిలో కంటే ఫాంహౌస్ లోనే ఎక్కువగా ఉంటున్నారన్న విమర్శ ఈ మధ్య ఎక్కువైంది. కారణాలు స్పష్టంగా చెప్పనప్పటికీ.. ఫాంహౌస్ కి వెళ్లే ముఖ్యమంత్రి మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండిపోవటం ఈ మధ్య ఎక్కువైంది.

తాజాగా చూస్తే.. ఆదివారం ఫాంహౌస్ కు వెళ్లిన కేసీఆర్.. శుక్రవారం సాయంత్రం కానీ హైదరాబాద్ నగరానికి చేరుకోలేదు. మరిన్ని రోజులు ముఖ్యమంత్రి ఏం చేశారని చూస్తే.. వ్యవసాయ క్షేత్రంలో పంటల్ని చూడటం.. త్వరలో నిర్వహించే అయుత చండీయాగానికి సంబంధించిన పనులపై దృష్టి సారించారు.

కొన్ని వ్యక్తిగతమైన పనుల కోసం.. ఇతర పనుల కోసం దాదాపు ఆరు రోజుల పాటు రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒక ముఖ్యమంత్రికి ఎప్పుడు ఎక్కడ ఉండాలని ఎవరూ చెప్పరు. కానీ.. ఈ మధ్యన రాష్ట్ర పాలన పక్కన పెట్టి.. ఫాంహౌస్ లో ఇన్నేసి రోజులు గడపటం ఏమిటన్నది ప్రధాన చర్చగా మారింది. ఉద్యమ సమయంలో ఎక్కువసేపు ఫాంహౌస్ లో గడిపిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిమితంగానే ఫాంహౌస్ కి వెళ్లేవారు. దీనికి భిన్నంగా ఈ మధ్య కాలంలో తరచూ ఫాంహౌస్ కి వెళ్లటం.. ఎక్కువ కాలం గడపటం విమర్శలకు తావిస్తోంది. చివరకు పరిస్థితి ఎలా మారిందంటే.. నగరానికి కేసీఆర్ వస్తుంటే.. ముఖ్యమంత్రి వచ్చేస్తున్నారోచ్ అని చెప్పుకునేలా మారిందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.