Begin typing your search above and press return to search.

తప్పును ఒప్పుకున్న కేసీఆర్.. విచారిస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Sep 2019 5:49 AM GMT
తప్పును ఒప్పుకున్న కేసీఆర్.. విచారిస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు అంచనాలకు ఏ మాత్రం అందనిది. ఆయన ఒకటి మాట్లాడతారని భావిస్తే.. అందుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించి నోట మాట రాకుండా చేశారు. శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ గరంగరం కావటం.. ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. బడ్జెట్ ను చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్టే అర్థమైపోతుందన్న విషయంతో పాటు.. కేసీఆర్ పాలనలోని లోపాల్ని ఎత్తి చూపారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇవ్వటం ద్వారా ఆయన వాదనలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. విమర్శల్ని వినేందుకు సైతం కేసీఆర్ కు ఇష్టం ఉండదని.. చేదు వాస్తవాల్ని చెబితే వాటిని పట్టించుకోకుండా ఎదురుదాడి చేసే తీరును తప్పు పడుతున్నారు.

గతానికి భిన్నంగా తాను చేసే వ్యాఖ్యలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావటం లేదన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్ తన గేమ్ ప్లాన్ ను మార్చినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. అసెంబ్లీలో విపక్ష నేత భట్టి విక్రమార్క మీద పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందని.. దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేసీఆర్ నోటి నుంచి మాట రావటం మామూలు విషయం కాదంటున్నారు.

అలా అని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు వాస్తవాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నది లేదు. అడ్డగోలు విమర్శలు చేస్తుంటే తాము ఊరుకోమన్న ఆయన.. గోదావరిపై కట్టిన.. కడుతున్న ప్రాజెక్టుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ 570 టీఎంసీల నీటిని తీసుకుంటామని.. కాళేశ్వరం మీద అడ్డగోలు విమర్శలు చేస్తే ఒప్పుకోమని తేల్చారు.

తామేమీ దేవుడి కొడుకులం కాదని.. ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటామని సీఎం కేసీఆర్ నోటి నుంచి వ్యాఖ్యలు చూస్తే.. అవసరానికి తగ్గట్లు అనునయంగా మాట్లాడటం ద్వారా అందరి ఆమోదం పొందాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెప్పక తప్పదు.

మిగిలిన రాష్ట్రాలకు.. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వైరుధ్యం ఏమంటే.. తెలంగాణ ప్రజలు ఒద్దికను ఓకే చేస్తారు. బరితెగింపును ప్రశ్నిస్తారు. అహంభావాన్ని అస్సలు ఒప్పుకోరు. తనను తెలంగాణ ప్రజలు ఎలా అయితే ఆమోదిస్తారన్న విషయం మీద క్లారిటీ ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే తన తాజా మాటలు ఉండేలా చూసుకోవటం గమనార్హం.

భట్టి మీద ప్రేమతో తన తప్పును ఒప్పుకోవట్లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన ఆవేశం.. ఆగ్రహం తెలంగాణ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తుందన్న అంచనాతోనే ఒకడుగు వెనక్కి వేసిన చందంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.