Begin typing your search above and press return to search.

దానంను కేసీఆర్ వద్దనుకున్నారా?

By:  Tupaki Desk   |   7 Dec 2015 9:29 AM GMT
దానంను కేసీఆర్ వద్దనుకున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిటికె వేయాలే కానీ.. విపక్షాల్లోని ఎంత పెద్ద నేతలైనా సరే.. ఆయనతో రాజీకి ఓకే చెప్పి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాస్త అతిశయంగా అనిపించినప్పటికీ.. లోతుగా చూస్తే.. ఈ వ్యాఖ్యలో ఎంతోకొంత నిజం ఉందనిపించక మానదు. ఎందుకంటే ఆయన కానీ టార్గెట్ చేసిన ఏ నేతా కూడా ఉండిపోలేదు.

ప్రస్తుతం మంత్రిగా ఉంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావునే తీసుకోండి. ఆయన తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు రావటానికి ససేమిరా అన్నారు. కానీ.. కేసీఆర్ మొండిఘటం. తాను అనుకున్న తుమ్మల తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు రారంటూ కాస్త ఫోకస్ చేశారు. ప్రయత్నం మీద ప్రయత్నం చేశారు. చివరికి ఏమైందో అందరికి తెలిసిందే.

ఇది.. తుమ్మల విషయంలోనే కాదు. ఏ నేత విషయంలోనైనా అలానే ఉంది. కానీ.. కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్ విషయంలో మాత్రం లెక్క ఎక్కడో తేడా కొడుతోంది. పలుమార్లు టీఆర్ ఎస్ లోకి తీసుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించినా.. ఆయన మాత్రం కారు ఎక్కలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. దానం నాగేందర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని.. ఆయన్నుపార్టీలో చేర్చుకునే విషయంలో సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే.. దానంను పార్టీలోకి తీసుకోవటం లాభిస్తుందన్న మాటను వాదిస్తున్న ఆయన సన్నిహిత వర్గం.. దానంతో చర్చలు షురూ చేసిందన్న మాట వినిపిస్తోంది.

చర్చలు ముగిసి.. దానం సుముఖత వ్యక్తం చేసే సమయంలో.. విషయం తెలిసిన కేసీఆర్ కల్పించుకొని.. ఆ ప్రయత్నాలు వద్దని విస్పష్టంగా చెప్పారని.. అందుకే.. తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయన్న మాట వినిపిస్తోంది నిజానికి కేసీఆర్ కానీ కావాలనుకుంటే.. ఏ నేతా ఆయన ఆకర్ష నుంచి తప్పించుకోలేరంటూ ఓ సీనియర్ గులాబీ నేత చేసిన వ్యాఖ్యలో ఎంతోకొంత నిజం ఉందనే చెప్పక తప్పదు.