Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్ లో కేసీఆర్ కోటా...ఉన్నట్టా? లేనట్టా?

By:  Tupaki Desk   |   27 May 2019 3:34 PM GMT
జగన్ కేబినెట్ లో కేసీఆర్ కోటా...ఉన్నట్టా? లేనట్టా?
X
2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు - 25 ఎంపీ సీట్లలో 22 సీట్లను గెలుచుకుని అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీని చావుదెబ్బ కొట్టేసింది. సరే... విజయం దక్కింది కాబట్టి ఈ నెల 30న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఓ వారం పది రోజుల వ్యవధిలో ఆయన తన కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ క్రమంలో అసలే వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో చాలా మంది నేతలు తమదైన శైలి యత్నాలు చేసుకుంటున్నారు. జగన్ కేబినెట్ లో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రత్యక్ష్యంగానో - పరోక్షంగానో ఇప్పటికే చాలా మంది నేతలు మొదలెట్టేశారు.

ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో కీలక జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే... జగన్ కేబినెట్ లో చోటు కోసం ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను సాయం అడిగారట. జగన్ తో తనకున్న మంచి సంబంధాలను ఆసరా చేసుకుని కేసీఆర్ సదరు ఎమ్మెల్యే పేరును సిఫారసు చేస్తారో - లేదో తెలియదు గానీ... ఈ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఇలా జగన్ కేబినెట్ లో చోటు కోసం కేసీఆర్ సిఫారసును సాధించే యత్నాల్లో ఉన్న నేత మరెవరో కాదు... నూజివీడు నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మేకా వెంకటప్రతాప్ అప్పారావేనట. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నూజివీడులో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మేకా... రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గానే రాణిస్తున్నారు.

వెలమ సామాజిక వర్గానికి చెందిన మేకా.. అదే సామాజిక వర్గానిక చెందిన కేసీఆర్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలనే నెరపుతున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కేబినెట్ లో చోటు దక్కితే... ఓ సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించడంతో పాటుగా ఏపీలోని వెలమలకు కూడా స్థానం కల్పించినట్లుగా ఉంటుందని మేకా తనదైన శైలి పావులు కదుపుతున్నారట. ఇప్పటికే కేసీఆర్ వద్ద మేకా తన ప్రతిపాదన పెట్టినట్టుగానూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమేర నిజముందన్న విషయాన్ని పక్కనపెడితే... ఒకవేళ... తన సామాజిక వర్గానికి చెందిన నేత కోసం జగన్ కు కేసీఆర్ సిఫారసు చేస్తే... అది ఎంత పెద్ద వార్త అవుతుందో చెప్పలేమన్న వాదన వినిపిస్తోంది. జగన్ కేబినెట్ లో కేసీఆర్ కూ కోటా ఉందన్న కోణంలోనూ ఆసక్తికర విశ్లేషణలకు తెర లేచినట్టే.