Begin typing your search above and press return to search.

కొత్త జిల్లా.. కొత్త మండలం.. కొత్త వైన్ షాపూ..!

By:  Tupaki Desk   |   25 July 2019 7:29 AM GMT
కొత్త జిల్లా.. కొత్త మండలం.. కొత్త వైన్ షాపూ..!
X
తెలంగాణలో కొత్త జిల్లాలు - కొత్త రెవెన్యూ డివిజన్లు - కొత్త మండలాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జిల్లాలు - కొత్త డివిజన్లు - మండలాలతో పాలన ఎంత సులభమైందో.. ప్రజలకు ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ మందుబాబులకు మాత్రం కొత్త పండగొస్తోంది. మందుబాబులకు అందుబాటులో కొత్తగా మరిన్ని దుకాణాలు రానున్నాయట.

తెలంగాణలో అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన ఆబ్కారీ విధానంలో అదనపు దుకాణాలకు సంబంధించిన అంశాన్ని చేర్చబోతున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు - మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి తగ్గట్టుగా దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దుకాణం ఉండేలా చూడాలనే విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 125 మండలాలు ఏర్పడ్డాయి. వీటిలో దాదాపు సగం వరకూ మండల కేంద్రాల్లో దుకాణాలు లేవు. ఇప్పుడు ఆయాచోట్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు డిమాండును బట్టి మిగతా మండల కేంద్రాలకూ మరికొన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. రెండేళ్లకుగాను 2017లో రూపొందించిన ఆబ్కారీ విధానం గడువు సెప్టెంబరు నెలతో ముగిసిపోనుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది కూడా రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. కసరత్తు త్వరలోనే కొలిక్కి రానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్‌ దుకాణాలు - 670 వరకూ బార్లు ఉన్నాయి. వీటి సంఖ్య భారీగా పెరగనుంది.