Begin typing your search above and press return to search.

దేవుడితో అయినా కోట్లాటకు రెఢీ అంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   2 Oct 2020 10:45 AM IST
దేవుడితో అయినా కోట్లాటకు రెఢీ అంటున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చే ఏ మాట కూడా ఉత్తినే రాదు. అందునా.. ఆగ్రహంతో కూడిన మాటల అంతత్వరగా రావు. దానికో వ్యూహం ఉంటుంది. అందుకు అనుగుణంగానే మాటలు ఉంటాయి. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలే కాదు.. లెక్క తేల్చాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. క్యాలెండర్లకు క్యాలెండర్లు మారటమే తప్పించి.. సమస్యల పరిష్కారం కాని పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు అన్నది కేవలం నాలుగైదుగంటల పనిగా కేసీఆర్ చెప్పేవారు. ఆయన మాటలు విన్న వారంతా విభజన ఇంత సులువా? అన్నట్లుగా ఆయన మాటలు ఉండేవి.

విభజన ప్రక్రియను వదిలేద్దాం. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్యనున్న పలు పంచాయితీలు రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా ఒక కొలిక్కి రాకపోవటం ఏమిటి? అందునా మేధావి కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యల్ని ఇట్టే పరిష్కారం చేసేయొచ్చుగా? అన్న ప్రశ్నకు సమాధానం రాని పరిస్థితి. తెలంగాణ - ఏపీ మధ్య ఉన్న నదీ జలాల అంశానికి సంబంధించి ఈ నెల ఆరున అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ వాదనల్ని బలంగా వినిపించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరో అడుగు ముందుకేసి.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యవసాయాన్ని.. రైతుల్ని కాపాడుకునేందుకు దేవునితోనైనా కోట్లాడతానని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. గతంలోనూ అపెక్సు కౌన్సిల్ భేటీలు జరిగాయి. అప్పుడు ఇంత ఘాటుగా రియాక్టు కాని కేసీఆర్ ఇప్పుడే ఎందుకింతగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

అయినా.. ఎవరికైనా మేలు చేయాలనుకునే దేవుడు.. కేసీఆర్ కు తనతో కోట్లాట పెట్టుకునేందుకు అవకాశం ఎందుకు ఇస్తాడు? కేసీఆర్ మాటలు.. రాష్ట్ర రైతుల కోసం ఎంతకైనా వెళతానన్నదే ఉద్దేశంగా చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని.. పంటలు భారీగా పండటంపై ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శనంగా నిలిచినట్లుగా ఆయన పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేటం చేసుకొని.. నదీ జలాల్ని ఒడిసిపట్టుకోవటం ద్వారా.. బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తన మాటలతో ఆరో తేదీన జరిగే అపెక్సు కమిటీ సమావేశంపై అందరి చూపు పడేలా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అవుతున్నారని చెప్పక తప్పదు.