Begin typing your search above and press return to search.

'అతి' ప్రచారానికి నో చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   5 Feb 2020 4:54 AM GMT
అతి ప్రచారానికి నో చెప్పిన కేసీఆర్
X
చేతిలో అధికారం ఉంటే ఆకాశంలో విహరించటం మామూలే. అందుకు భిన్నంగా ఎప్పుడేం చేయాలి? ఏం చేయకూడదన్న విషయంలో ఏ మాత్రం ప్రాక్టికాలిటీని మిస్ కాని అతి తక్కువ ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరని చెప్పాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వేళ.. సార్.. మీ ఫోటోల్ని భారీగా వాడేస్తాం.. మీకు మస్తు ప్రచారం వస్తుందంటే.. ఖుషీ కావటం.. ఓకే చెప్పేయటం మామూలే.

అలా చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? ఊహించని రీతిలో రియాక్ట్ కావటం.. మోతాదు పెరిగితే అతి అనర్థాలకు దారి తీస్తుందన్న విషయంలో గులాబీ బాస్ కు అవగాహన ఎక్కువే. అందుకే.. తన ఫోటోల్ని పెద్ద ఎత్తున వాడేస్తామని ఆర్టీసీ చెబితే అందుకు నో అని చెప్పటమేకాదు.. విస్పష్టంగా నోట్ కూడా పంపిన వైనం ఆసక్తికరంగా మారింది.

సరుకు రవాణాకు వీలుగా ఆర్టీసీ కార్గో బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది ఆర్టీసీ. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోల్ని అచ్చేయాలని.. దీంతో మంచి మైలేజీ వస్తుందన్న మాటను చెప్పారు.

అయితే.. ఈ ప్రతిపాదనకు కేసీఆర్ నో చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావటమే తన లక్ష్యమే తప్పించి.. ఫోటోలు వేసుకొని ప్రచారం చేయటం తనకిష్టం లేదని చెప్పటం ద్వారా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. బస్సులపై ఫోటోలు వేయించుకొని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని.. ఆర్టీసీ అధికారుల ప్రతిపాదనకు నో చెప్పేశారు. అంతేకాదు.. తన ఫోటోలు వాడొద్దని నోట్ ను పంపారు.

అందులో ముఖ్యమంత్రి ఫోటోను వాడొద్దని విస్పష్టంగా పేర్కొనటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఫోటోలతో వచ్చే మైలేజీ కంటే.. ఫోటోలు వాడొద్దంటూ నోట్ పంపిన వైనంతో సీఎం కేసీఆర్ కు భారీ మైలేజీ రావటమే కాదు.. ప్రచారం కంటే పని తనకు ముఖ్యమన్న మాటతో తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుచుకునే వ్యూహానికి ఫిదా కావాల్సిందే. అతి ప్రచారాన్ని ప్రజలు హర్షించరని.. దాని కంటే నో చెప్పటం ద్వారా అంతకు రెట్టింపు మైలేజీ పొందటమే గులాబీ బాస్ వ్యూహంగా చెప్పక తప్పదు.