Begin typing your search above and press return to search.

రాబోయే ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   18 Nov 2019 7:26 AM GMT
రాబోయే ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్
X
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో ఓ 45 లక్షల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మాడు ఓ బీజేపీ నాయకుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించాడు. కానీ సదురు బీజేపీ నేత భూమిని రిజిస్ట్రర్ వేరొకరికి ఎక్కువ రేటుకు అమ్మేశాడు. ఆ 45 లక్షలను కూడా రియల్ వ్యాపారికి ఇవ్వలేదు.. మోసం చేశాడు. దీంతో ఏడాదిన్నరగా పోలీసుల చుట్టు తిరుగుతున్నాడు రియల్ వ్యాపారి. సివిల్ కేసు అని పోలీసులు కోర్టులో తేల్చుకోమన్నారు. దీంతో విసిగి వేసారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బీజేపీ నేత ఇంటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రియల్ వ్యాపారి టీఆర్ఎస్ పద్మాశాలీ నేతకు బంధువు. దీంతో ఈ వివాదం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల వివాదంగా మారి కొత్త మలుపు తిరిగింది. భూ పంచాయతీల్లో నేతల జోక్యంతో కొందరు అమాయకుల ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

తహసీల్దార్ విజయారెడ్డి మరణం తర్వాత తెలంగాణలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆ మార్పు తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఒకింత భయాన్ని కలిగించింది. ఇక ప్రజల్లో విజయారెడ్డి మరణం తర్వాత రెవెన్యూశాఖపై తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడీ పరిణామం సీఎం కేసీఆర్ లో కూడా మార్పునకు కారణం కావడం ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు 5 నుంచి 10 రెట్లు పెరిగాయి. ఎక్కడ చూసినా 10 లక్షల నుంచి 5కోట్ల వరకూ స్థలాలున్నాయి. డబ్బు ఆశతో భూ క్రయవిక్రయాల్లో భారీగా మోసాలు, దందాలు జరుగుతున్నాయి. నేతలు జోక్యం చేసుకొని సెటిల్ మెంట్లు చేస్తుండడంతో బాధితుల ఆత్మహత్యలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి..

తహసీల్దార్ విజయారెడ్డి హత్యలో కొందరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ప్రచారం సాగింది. దీంతో కేసీఆర్ సైతం అలెర్ట్ అయ్యారు. తాజాగా తన ప్రభుత్వంలోని మంత్రులు - టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు పంపారు. ఎవ్వరూ భూవివాదాల్లో తలదూర్చవద్దని.. సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచించారట.. లేకపోతే అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతుందని.. నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేశారు.

ఇలా తెలంగాణలో రియల్ ఎస్టేట్ వల్ల ఎన్నో సమస్యలు వచ్చిపడుతున్నాయి. స్వయంగా కేసీఆర్ సైతం ఈ భూదందాలపై ఆందోళనగా ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.