Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త ఆప‌రేష‌న్‌...ఈ అమావాస్య త‌ర్వాత‌

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:30 PM GMT
కేసీఆర్ కొత్త ఆప‌రేష‌న్‌...ఈ అమావాస్య త‌ర్వాత‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కానున్నార‌ని స‌మాచారం. నూత‌న అధికారిక నివాసం ప్రగతి భవన్‌ లోని జనహిత ఇక జనంతో కళకళలాడునుంది. రైతులు - వివిధ కుల వృత్తులు - మహిళలు - సంఘాలకు చెందిన ప్రజలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజూ సమావేశం కానున్నారని స‌మాచారం. ఆయా వృత్తులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వారి నుంచే అభిప్రాయాలు తీసుకుంటారు. ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినా, పెట్టుబడులు ఎన్ని వచ్చినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఏం చేయాలో నిర్ణయించే విధంగా జనహిత సమావేశాలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

మొదటి రెండేళ్ల పాటు పథకాల రూపకల్పన - అమలుపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మిగిలిన ఈ రెండున్నర ఏళ్ల కాలం ఎక్కువగా ప్రజలతో మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వివిధ వృత్తులకు సంబంధించిన అంశాలపై సూక్ష్మస్థాయిలో వివరాలు సేకరించారు. జనహితలో ఆ వృత్తికి సంబంధించిన వారితో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రజల ఆదాయం పెంచడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నార‌ని అందులో భాగంగానే జనహిత సమావేశాలకు రూపకల్పన చేశారని స‌మాచారం. ఆయా వృత్తులకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి సీఎం నేరుగా వారికి వివరిస్తారు. తెలంగాణ నేల స్వభావం - ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, ఆధునిక వ్యవసాయం - మార్కెటింగ్ తదితర అంశాల గురించి రైతులకు దృశ్య రూపకంగా వివరించి - రైతుల సాధక బాధకాల గురించి చర్చిస్తారు. జనహితలో ఒకేసారి వెయ్యి మందితో సమావేశం కావడానికి అవకాశం ఉన్న నేప‌థ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలో సభలు - సమావేశాలు - విస్తృత పర్యటనల ద్వారా జనానికి చేరువ అయిన కేసీఆర్, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తొలి రెండున్నర ఏళ్ల కాలం అధికారిక కార్యక్రమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిన రెండున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికే జనహితంలో వినూత్నంగా ఆయా వృత్తుల వారితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అమావాస్య దాటిన తరువాత వరుసగా ఈ సమావేశాలు ఉంటాయని స‌మాచారం. మొత్తం 31 జిల్లాల నుంచి ప్రతినిధులను జనహితకు ఆహ్వానిస్తారు. జిల్లాల్లో కలెక్టర్లు వారిని ఎంపిక చేస్తారు. ఆయా వృత్తి సంఘాల నాయకులు, వృత్తిలో ఉన్నవాళ్లను పిలుస్తారు. జిల్లా కలెక్టర్లు అందరూ జిల్లాలో ఈ జాబితా రూపొందిస్తారు. జిల్లా కేంద్రం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌ టిసి బస్సులోనే వీళ్లు హైదరాబాద్‌ లోని సీఎం నివాస భవనం జనహితకు వస్తారు. అక్కడే భోజనం వంటి ఏర్పాట్లు ఉంటాయి. సమావేశం ముగిసిన తరువాత ప్రభుత్వం ఆర్‌టీసీ బస్సులను ఏర్పాటు చేసి తిరిగి జిల్లా కేంద్రానికి పంపిస్తారు. ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. జనహిత సమావేశాలకు హాజరై తమ జిల్లాకు తిరిగి వెళ్లిన తరువాత మరో పది మందికి వివరించగలిగే వారినే ఈ సమావేశాలకు ఆహ్వానిస్తామని సీఎం బృందంలో జనహిత ఏర్పాట్లను పరిశీలిస్తున్న వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/