Begin typing your search above and press return to search.

పొగిడే బదులు.. గుర్తు పెట్టుకునే ప్రకటన చేసేయొచ్చుగా కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Sept 2020 9:45 AM IST
పొగిడే బదులు.. గుర్తు పెట్టుకునే ప్రకటన చేసేయొచ్చుగా కేసీఆర్
X
ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏ మాత్రం అంచనా వేయలేని రీతిలో వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలకు.. చేతలకు ఏ మాత్రం పొంతన లేని రీతిలో ఉంటుంది. తాజాగా దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విషమే దీనికి ఉదారణగా చెప్పాలి. ఇటీవల ఆయన మరణించిన విషయం తెలిసిందే.

ఆయన మరణానికి అసెంబ్లీలో సంతాపాన్ని తెలియజేసే క్రమంలో.. ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. తెలంగాణకు చాలా చేశారని చెబుతూ.. చరిత్రలో వారి స్థానం శాశ్వితంగా నిలిచిపోతుందని పొగిడేశారు. మరి.. అంత చేసిన ప్రముఖుడి విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ.. మాటలకే సరిపెట్టారే తప్పించి.. మరేమీ చేయకపోవటం గమనార్హం.

రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా ప్రణబ్ నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి సారథ్యం వహించటమే కాదు.. ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానానికి మార్గదర్శనం చేయటంలో కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన నేతగా నిలిచిపోతారన్నారు. మరి.. తెలంగాణకు అంతచేసిన ఆయన పేరు మీదన ఒక ప్రకటనో.. తెలంగాణలో ఆయన గుర్తుగా ఫలానా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎందుకు ప్రకటించలేదు?

తెలంగాణ కోసం అంతలా పాటుపడిన ముఖ్యనేత విషయంలో కేసీఆర్ మాటలకే పరిమితం కావటం ఏమిటన్నది ప్రశ్న. ఇక్కడే కేసీఆర్ చతురత కనిపిస్తుంది. తెలంగాణ కోసం ఎవరెంత చేసినా.. అవన్నీ మాటలకే పరిమితం కావాలే కానీ.. చరిత్రలో నిలిచిపోకూడదన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఇటీవల పీవీ నరసింహారావు వ్యవహారమే తీసుకోండి. ఆయన్ను అంతలా భుజాన ఎత్తుకోవటానికి కారణం.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలన్న లక్ష్యమే.

పీవీ శతజయంతి పేరుతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల్ని నిర్వహించే క్రమంలో తన జాతీయ పార్టీ ఆలోచనను తెర మీదకు తీసుకురావటం.. కాంగ్రెస్ ను ఉతికి ఆరేసే ప్లాన్ లో భాగంగా ఇంత చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ విషయంలో సానుకూలంగా వ్యవహరించిన వారిని పొగిడి వదిలేసే బదులు.. వారి పేరు గుర్తుండిపోయేలా చేయటం ద్వారా కేసీఆర్ కూడా జాతి జనుల మనసుల్లో నిలిచిపోతారన్న విషయాన్ని మర్చిపోకూడదు.