Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో కేసీఆర్ ‘సినిమా’ చూపించాలంటే..?

By:  Tupaki Desk   |   29 March 2016 4:28 AM GMT
అసెంబ్లీలో కేసీఆర్ ‘సినిమా’ చూపించాలంటే..?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత విలక్షణంగా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలే కాదు చేతలు సైతం భిన్నంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు చేశారు కూడా. గత కొద్ది కాలంగా కేసీఆర్ ఒక విషయం మీద విపరీతమైన పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చేలా తాను సాగునీటిప్రాజెక్టుల విషయంలో నిర్ణయం తీసుకున్నానని.. ఆ విషయాల్నిరాష్ట్ర ప్రజలకు చెప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే.. ఇందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు.

చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ కోణాన్ని వివరిస్తూ.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో తన ప్రసంగంలో భాగంగా పలుమార్లు ప్రస్తావించారు కూడా. తాజా సమావేశాల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే.. సంప్రదాయానికి విరుద్దమైన ఈ కార్యక్రమాన్ని విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో అధికారపక్షం ఇరిగేషన్ మీద సినిమా చూపిస్తే.. ఆ తర్వాత తమ సినిమా కూడా చూపించేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.

కేసీఆర్ సినిమాకు కౌంటర్ గా సాగునీటి రంగం మీద తమ వాదనను వినిపించేలా సినిమా చూపించాలన్న ఆలోచనలో విపక్షాలు ఉన్నాయి. కేసీఆర్ కోరికకు.. విపక్షాలు ఇలా కౌంటర్ ఇవ్వటంతో.. ప్రజంటేషన్ వ్యవహారం ఏమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ నెలాఖరులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల మీద ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ అధికారపక్షం కానీ ప్రజంటేషన్ ఇవ్వాలని నిర్ణయిస్తే.. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో పాటు.. విపక్షాలన్నీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావాలన్న ఆలోచనలో విపక్షాలు ఉన్నాయని చెబుతున్నారు. లేదంటే.. కమిటీ హాల్లో ఈ ప్రజంటేషన్ ఇవ్వాలని విపక్షాలు సూచిస్తున్నాయి.

అలా కాదు.. అసెంబ్లీలోనే ప్రజంటేషన్ అంటే.. ఇప్పటివరకూ అలాంటి సంప్రదాయం లేదని.. ఒకవేళ తెలంగాణ అధికారపక్షం తప్పనిసరిగా ఇవ్వాలని భావిస్తే.. సీఎం ప్రజంటేషన్ తర్వాత విపక్షానికి కూడా ప్రజంటేషన్ అవకాశం ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అసెంబ్లీలో తెలంగాణ అధికారపక్షం సినిమా చూపించటం అంత తేలిగ్గా పూర్తి అయ్యేటట్లు కనిపించటం లేదనే చెప్పాలి.