Begin typing your search above and press return to search.

ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్న‌ కేసీఆర్

By:  Tupaki Desk   |   12 Aug 2016 5:00 PM IST
ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్న‌ కేసీఆర్
X
రాజ‌కీయాల్లో వ్యూహం ఫ‌లించ‌డం ద్వారా ద‌క్కే విజ‌యాలు ఉన్న‌ట్లే ఒక్కోసారి ప‌రిస్థితులు అనుకూలంగా ఉండ‌టం వ‌ల్ల క‌లిగే లాభం కూడా అలాగే ఉంటుంది. ఎన్నిక‌ల వ్యూహాల్లో అందెవేసిన చేయి అనే పేరున్న టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇపుడు ఈ రెండు ర‌కాల లాభాలు పొందుతున్నారు. అది కూడా ఢిల్లీ కేంద్రంగా కావ‌డం ఆస‌క్తిక‌రం. తెలంగాణ‌లో జ‌రిగిన జీహెచ్ ఎంసీ స‌హా ప‌లు ఉప ఎన్నిక‌ల్లో త‌న ప్లానింగ్‌ తో గులాబీ జెండా ఎగ‌రేసిన కేసీఆర్ ఇపుడు ప‌రిస్థితులు అనుకూలించ‌డం వ‌ల్ల, ప్ర‌తిప‌క్షాల సంయ‌మ‌నంతో హ‌స్తినాలోనూ త‌న‌కు వ్య‌తిరేక‌త లేద‌నే భావ‌న‌న‌ను క‌లిగించుకోవ‌డంలో స‌ఫ‌లం అయ్యార‌ని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో భాగంగా ఇప్పటికీ ఇద్ద‌రు ఎంపీలు అధికారికంగా కారెక్కారు. మ‌ల్కాజ్‌ గిరీకి చెందిన టీడీపీ ఎంపీ మ‌ల్లారెడ్డి - వైసీపీ నుంచి గెలిచిన ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. న‌ల్ల‌గొండ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నాయ‌కుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి సైతం కారెక్కారు. అయితే ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకోలేదు. ఈ జంపింగ్‌ ల‌తో షాక్ తిన్న కాంగ్రెస్‌ - టీడీపీ - వైసీపీలు త‌మ ఎంపీల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మల్కాజ్‌ గిరి ఎంపీపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న‌ద‌ని స‌మాచారం వెలువ‌డింది. ఈ ఫిర్యాదు వ‌స్తే బీజేపీ పెద్దలు కూడ చర్య తీసుకునేందుకు ఆసక్తిగా ఉండే క్రమంలో వీరిపై త్వరలోనే అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయనే చ‌ర్చ సాగింది. ఇక లోక్‌ సభలో ప్ర‌ధాన‌ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడ గుత్తాపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేస్తామని ప్ర‌క‌టించింది. ఇదే స్థాయిలో వైసీపీ సైతం స్పందించింది.

అయితే పార్ల‌మెంటు స‌మావేశాలు జోరుగా సాగుతున్నప్ప‌టికీ మూడు ప్ర‌ధాన పార్టీలు జంపిగ్‌ ల ప్ర‌స్తావ‌నే తేవ‌డం లేదు. ఒక‌వైపు తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని పేర్కొంటూనే మ‌రోవైపు త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు పార్టీ మారిన తీరుపై ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక‌వేళ ఆ ఎంపీల రాజీనామా ఆమోదం పొందితే వ‌చ్చే ఉప ఎన్నికల్లో ఓట‌మి భ‌యంతోనే ఈ విధంగా ప్ర‌తిప‌క్షాలు వెన‌క‌డుగు వేస్తున్నాయ‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. త‌మ నాయ‌కుడు ఢిల్లీలో కూడా చ‌క్రం తిప్పుతున్నార‌ని గులాబీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.