Begin typing your search above and press return to search.

స‌చివాల‌యం త‌ర్వాత ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత‌

By:  Tupaki Desk   |   22 July 2020 2:30 PM GMT
స‌చివాల‌యం త‌ర్వాత ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత‌
X
ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని స‌చివాల‌యం భ‌వ‌న స‌ముదాయం కూల్చివేత ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. వీటి త‌ర్వాత ఉస్మానియా ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం యోచిస్తోంది. వెంట‌నే ఆ ఆస్ప‌త్రి భ‌వ‌న స‌ముదాయం కూల్చ‌డానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఎంతో చారిత్రాత్మ‌క భ‌వ‌నం.. ద‌శాబ్దాల నాటి నిర్మాణం కావ‌డంతో వ‌ర్షాకాలంలో కూలిపోయే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టికే మొన్న వ‌ర్షాల‌కు ఆస్ప‌త్రిలో వ‌ర‌ద భారీగా చేరింది. మోకాళ్ల ‌లోతు నీళ్లు రావ‌డంతో ఆస్ప‌త్రిలోని రోగులు.. వైద్యులు.. వైద్య సిబ్బంది తీవ్ర అవ‌స్థ‌లు ఎదుర్కొన్నారు. దీంతో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డాయి. అయితే ఆ విమ‌ర్శ‌ల‌ను మంత్రులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. నాయ‌కులు తిప్పికొట్టారు. వారి తీరును ఎండ‌గ‌ట్టారు. అప్ప‌ట్లో కూల్చివేత‌కు అడ్డుప‌డి ఇప్పుడు రాజ‌కీయం చేయ‌డం త‌గ‌ద‌ని చెప్పారు.

అవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే ఈ ప‌రిణామంతో ప్ర‌భుత్వం ఇప్పుడు ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. గ‌తంలోనే ఈ ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేయ‌డానికి ప్ర‌భుత్వం మొత్తం సిద్ధం చేసుకోగా ప్ర‌తిప‌క్షాలు.. చ‌రిత్ర‌కారులు.. త‌దిత‌రులు అడ్డుప‌డ్డారు. ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేత‌ను అడ్డుకోవాల‌ని హైకోర్టుతో పాటు పురావ‌స్తు శాఖ‌ను ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వారంతా అడ్డుపుల్ల‌లు వేయ‌డంతో అప్ప‌ట్లో ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేత నిర్మాణం ఆగిపోయింది.

హైద‌రాబాద్ అఫ్జ‌ల్‌గంజ్ స‌మీపంలో ఉన్న ఉస్మానియా ఆస్ప‌త్రి రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ప్ర‌భుత్వం ఆస్ప‌త్రి. ఈ ఆస్ప‌త్రిని 2015లో ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు సంద‌ర్శించారు. ఆస్ప‌త్రిని కూల్చివేసి స‌క‌ల స‌దుపాయాల‌తో ఆస్ప‌త్రి నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మొత్తం 27 ఎక‌రాల్లో ఆస్ప‌త్రి విస్తీర్ణం ఉంది. ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ప్ర‌ధాన భ‌వ‌నం పురాత‌న‌మైన‌ది. ఈ భ‌వ‌నం 2.37 ఎక‌రాల్లో ఉంది. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ఏఐఎంఐఎం పార్టీ కూడా అడ్డుప‌డింది. న్యాయ‌స్థానాల‌తో పాటు వీధి పోరాటాల‌కు దిగ‌డంతో అప్పుడు ప్ర‌భుత్వం ఈ ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేత‌కు వెన‌క్కి త‌గ్గింది. అయితే ఇప్పుడు భ‌వ‌నం పూర్తి శిథిలావ‌స్థ‌కు చేర‌డం.. వ‌ర్షాల‌కు మునిగిపోతుండ‌డంతో ప్ర‌భుత్వం ఇక ఆస్ప‌త్రి భ‌వ‌నం కూల్చివేత‌కు సిద్ధ‌మైంది.

ప్ర‌స్తుతం ట్యాంక్‌బండ్ స‌మీపంలో ఉన్న స‌చివాల‌య భ‌వ‌నం కూల్చివేత ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఆ ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత వెంట‌నే ప్ర‌భుత్వం ఉస్మానియా ఆస్ప‌త్రి కూల్చివేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాలు కూడా ఆస్ప‌త్రి కూల్చివేత‌ను డిమాండ్ చేస్తుండంతో ఆస్ప‌త్రి కూల్చివేత‌కు మార్గం సుగ‌మ‌మైంది. దీంతో త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆస్ప‌త్రిపై స‌మీక్ష చేసేలా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వైద్య.. రోడ్లు భ‌వ‌నాలు.. పురావ‌స్తు అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో త్వ‌ర‌లోనే మ‌రో గొప్ప క‌ళాత్మ‌క భ‌వ‌నం నేల‌కూల‌నుంది. కాల‌గ‌ర్భంలో చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం కూలిపోనుంది. ఏది ఏమున్నా పేద రోగుల‌ కోసం ఆస్ప‌త్రిని కూల్చివేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.