Begin typing your search above and press return to search.

తన ‘సెక్రటరీ’ పదవి ఇచ్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 July 2016 12:47 PM IST
తన ‘సెక్రటరీ’ పదవి ఇచ్చేసిన కేసీఆర్
X
వ్యూహాత్మకంగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉన్న మరో లక్షణం.. తనను నమ్ముకున్న వారిని మర్చిపోకుండా ఉండటం. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఉద్యమ సమయంలో తన వెంటే ఉంటూ.. సాకారం అవుతుందో లేదో తెలీని తెలంగాణ సాధన పట్ల నమ్మకంతో కేసీఆర్ వెంట నడిచినోళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వారంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే.. తమకిక పదవులు వచ్చేసినట్లుగా భావించారు. అయితే.. ప్రతిది లెక్క ప్రకారం నడుచుకునే కేసీఆర్.. తాను సీఎం అయిన వెంటనే.. పదవులు పందేరం చేయలేదు.

ఆచితూచి వ్యవహరిస్తూ.. ఇప్పటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా ఊరిస్తూ ఉన్నారు. రాష్ట్రం ఏర్పడి.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాతిక నెలలు కావొస్తున్నా ఆయన ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటం పట్ల పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. అలా అని తమ లోపలి బాధను బయటకు రానివ్వకుండా.. ఇవాళ.. కాకుంటే రేపు మంచి రోజు ఉంటుందంటూ ఆశగా లెక్కలేసుకుంటున్న పరిస్థితి.

చేతిలో ఉన్న పదవులన్నీ అప్పజెప్పేయకుండా.. అర్హులను అందలం ఎక్కించాలన్నట్లుగా కేసీఆర్ భావనగా ఆయన సన్నిహితులు చెబుతారు. అందుకు తగ్గట్లే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఉదహరిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కేసీఆర్ ను నమ్ముకున్న ఆయన పొలిటికల్ సెక్రటరీ సుభాష్ రెడ్డికి తాజాగా నామినేటెడ్ పోస్ట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సుభాష్ రెడ్డి.. టీఆర్ ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. తాను పవర్ లోకి వచ్చాక పొలిటికల్ సెక్రటరీ పదవిని అప్పజెప్పిన కేసీఆర్.. తాజాగా ఆయన్ను ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

సుభాష్ రెడ్డి నియామకంతో టీఆర్ ఎస్ క్యాడర్ లో ఒక్కసారి ఉత్సాహం పెల్లుబికింది. రెండేళ్లుగా వాయిదా పడుతున్న నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ భర్తీ చేయటం మొదలైందన్న సంకేతం తాజా నియామకం స్పష్టం చేసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి..నామినేటెడ్ పోస్టుల కోసం చకోర పక్షులుగా ఎదురుచూస్తున్న ఆశావాహుల ఆశల్ని కేసీఆర్ ఎప్పటికి తీరుస్తారో చూడాలి.