Begin typing your search above and press return to search.

స్కూళ్లగా మారనున్న జైలు.. రేస్ కోర్ట్

By:  Tupaki Desk   |   30 Dec 2015 11:05 AM IST
స్కూళ్లగా మారనున్న జైలు.. రేస్ కోర్ట్
X
గత కొద్దిరోజులుగా యాగం పనులతో హడావుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం పాలన మీద దృష్టి పెట్టారు. యాగం పూర్తి కావటం.. అనంతర కార్యక్రమాల్ని ముగించిన ఆయన.. పరిపాలనా సంబంధమైన అంశాల మీద దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో అందరిని ఆసక్తి రేకెత్తించే అంశం.. మలక్ పేట కు సమీపంలోని చంచల్ గూడ జైలును.. గుర్రపు పందాలకు అడ్డా అయిన రేస్ కోర్సును నగర శివారుల్లోకి మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న పలు కట్టడాల్ని.. పలు సంస్థల్ని వేర్వేరు చోట్లకు మార్చటం కేసీఆర్ కు కొత్తేం కాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన పలు మార్పులు.. చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వీటిల్లో కొన్నింటిపై సానుకూలత వ్యక్తమైతే.. మరికొన్ని విషయాలు వివాదాలుగా మారాయి. తాజాగా చంచల్ గూడ జైలును చర్లపల్లికి.. రేస్ కోర్సును నగరశివారుకు మార్చాలంటూ నిర్ణయంతీసుకున్నారు. అదే సమయంలో ఈ రెండుచోట్ల రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ నుంచి వీటి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ నిర్ణయం పుణ్యమా అని జైలు.. రేస్ కోర్సు స్కూళ్లగా మారబోతున్నాయన్నమాట.