Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉంటుందంటే..?

By:  Tupaki Desk   |   4 March 2016 6:11 AM GMT
కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉంటుందంటే..?
X
తాను అనుకున్నది ఏదైనా సరే.. ఎలాగైనా పూర్తి చేయాలన్న మైండ్ సెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది. వాస్తు బాగోలేదని ఫీల్ అయిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ ఉన్న పాత సచివాలయం మీద ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు. అంతే.. కొంగొత్తగా.. తనకు నచ్చిన రీతిలో సరికొత్తగా కట్టించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఏ ప్లేస్ అయితే బాగుంటుందో చూసి.. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో కొత్త సచివాలయాన్ని కట్టించాలని డిసైడ్ అయ్యారు.

దీనికి సంబంధించి చాలానే ఇబ్బందులు ఎదురైనా.. కేసీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు సరికదా.. తనకు ఎదురైన ఇబ్బందుల్ని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. సచివాలయాన్ని ఏర్పాటు చేయటానికి ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దికాలంగా ఎర్రగడ్డలో నిర్మించాలనుకున్న సచివాలయం గురించి కేసీఆర్ నోటి నుంచి ఎలాంటి మాట రాకపోవటంతో ఆయన మర్చిపోయినట్లుగా అంతా భావించారు.

కానీ.. తనదైన టైం కోసం ఎదురు చూసిన ఆయన.. లోగుట్టుగా ఈ అంశంపై ఏమేం చేయాలో అన్నీ పూర్తి చేశారు. తాను కోరుకుంటున్న కలల సచివాలయం ఎలా ఉండాలి? దాన్ని ఎలా నిర్మించాలి? అందుకోసం ఎంత మొత్తం అవసరమవుతుంది? లాంటి ప్లాన్లు అన్ని సిద్ధం చేసుకున్న ఆయన.. తాజాగా కొత్త సచివాలయానికి సంబంధించి అంశాల్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారు.

తాజాగా బయటకు వచ్చిన లెక్కల ప్రకారం కొత్త సచివాలయానికి వెయ్యి కోట్ల రూపాయిలు అవసరమవుతాయని చెబుతున్నారు. ప్రాధమికంగా రూ.900 కోట్లు అనుకున్నప్పటికీ.. అంతా పూర్తి అయి.. అందులో చేరే సరికి వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేయటం ఖాయమంటున్నారు. మొత్తం 48 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఛాతీ ఆసుపత్రి.. మరో 42 ఎకరాల్లో ఉన్న మానసిక వైద్యశాలకు చెందిన 42 ఎకరాలు కలిపి.. మొత్తంగా 90 ఎకరాలు అందుబాటులోకి రానుంది. ఇందులో దాదాపు 50 ఎకరాల్లో (కాస్త అటూఇటుగా) తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని భావిస్తున్నారు.

అన్ని ఆఫీసులు ఒకేచోట ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి ప్రయాణానికి వీలుగా హెలీప్యాడ్ తో పాటు.. ఆగస్టు 15.. జనవరి 26 రోజుల్లో నిర్వహించే పరేడ్ ను సైతం సచివాలయంలోనే ఏర్పాటు చేస్తే సరిపోతుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త సచివాలయం విశాలంగా.. పచ్చదనంతో కళకళలాడుతూ ఉండటమే కాదు.. అత్యాధునికంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటారని చెబుతున్నారు. పెద్ద ఎత్తున వాహనాలు వచ్చినా ఎలాంటి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ టేస్ట్ తగ్గట్లే కొన్ని ప్లాన్లు సిద్ధం చేశారని.. మరో రెండు వారాల్లో వీటికి సంబంధించిన ఆయన ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరి.. వాటి డిజైన్స్ గతంలో మాదిరి ముందే రిలీజ్ చేస్తారా..?