Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికకు నాటకీయ పరిణామాలు?

By:  Tupaki Desk   |   12 Oct 2015 7:40 AM GMT
ఉప ఎన్నికకు నాటకీయ పరిణామాలు?
X
మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల కమిషన్ ప్రకటన వెలువడిన వెంటనే.. ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. దీని కంటే ముందే.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికకు సంబంధించి తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగిపోతున్నాయి.

ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వటం.. మిగిలిన రాజకీయ పక్షాలు బరిలోకి నిలవకుండా నిర్ణయం తీసుకోవటం ద్వారా.. ఉప ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్న పరిస్థితి. విబజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది.

ఏపీలోని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి నిలపటంతో పోలింగ్ అనివార్యమైంది. ఇక.. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే మృతితో చోటుచేసుకుంది. అయితే.. ఉప ఎన్నికల బరిలోకి దిగాలని తెలంగాణ అధికారపక్షం నిర్ణయించటంతో ఎన్నిక పక్కా అని తేలిపోయింది. అయితే.. నాటకీయంగా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే.. దివంగత కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డిని టీఆర్ ఎస్ లోకి తీసుకొచ్చి ఆయన్ను ఎన్నికల బరిలో నిలపాలనుకోవటం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు.

అయితే.. ఇదే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమయాన టీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన భూపాల్ రెడ్డి ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కిష్టారెడ్డి కుమారుడ్ని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ మరో భారీ దెబ్బగా భావిస్తున్నారు. అయితే.. కిష్టారెడ్డి కుమారుడి ఎంట్రీ వ్యవహారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లో ఉందని.. ఆయన ఓకే చేయాల్సి ఉందని చెబుతున్నారు. మరి.. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.