Begin typing your search above and press return to search.

అప్పులు కోసం ‘భగీరథ’ ప్రయత్నం

By:  Tupaki Desk   |   14 May 2016 8:26 AM GMT
అప్పులు కోసం ‘భగీరథ’ ప్రయత్నం
X
తెలంగాణ ప్రయత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పు పుట్టడం లేదట. టీ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టుకు అప్పులు తేవాల్సిన బాధ్యతను అధికారులపై పెట్టిందట ప్రభుత్వం. కానీ.. ఈ ప్రాజెక్టుకు దేశ - విదేశాలలో ఉన్న ఆర్థిక సంస్థలు అంత ఈజీగా అప్పు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. దీంతో అధికారులు నానా తిప్పలు పడుతున్నారట. మిషన్‌ భగీరథ ప్రాజెక్టును వచ్చే ఎన్నికల్లోపే పూర్తి చేస్తామని లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ... పరిస్థితులు చూస్తుంటే ఇది ఇప్పటికిప్పుడు పూర్తయ్యేలా లేదు. దీంతో అన్నమాట ప్రకారం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో చేయరో చూడాలి.

బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం.. బయట రుణాలు దొరక్కపోవడంతో మిషన్ భగీరథకు నానా తిప్పలు మొదలయ్యాయి. నీటి కోసం భగీరథ ప్రయత్నంలా కాకుండా అప్పుల కోసమే భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోందని అధికారులు చాటుమాటుగా అనుకుంటున్నారు. ఇటీవల అధికారులు కొందరు ముంబై వెళ్లి నాబార్డు చైర్మెన్ - ఎల్ ఐసీతో భేటీ అయి మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి వివరించారు. అయితే.. నాబార్డు ఇప్పటికే దీనికి రూ.5 వేల కోట్లు ఇవ్వడంతో మళ్లీ రుణం కావాలంటే ప్రాజెక్టు కు సంబంధించిన మరిన్ని వివరాలు కావాలని అడిగినట్లు సమాచారం. ఎల్ ఐసీ అయితే.. పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

మొదట తెలంగాణ అధికారులు జైకా బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. దీంతో విదేశీ రుణాలు కంటే స్వదేశీ సంస్థల వద్ద అయితే బెటర్ అనుకుని నాబార్డు - ఎల్ ఐసీలను సంప్రదించారు. అక్కడ కూడా రుణం అంత సులభంగా దొరికే పరిస్థితులు లేవని తెలుస్తోంది. కొద్ది రోజలు కిందట ఎస్‌ బిహెచ్ చైర్మెన్‌ తో కూడా రుణం కోసం అధికారులు చర్చించినా అక్కడా సానుకూలత రాలేదని సమాచారం. దీంతో కోటక్ మహేంద్ర - ఆంధ్రాబ్యాంకు - కెనరా బ్యాంకుతో పాటు ఐడీబీఐ బ్యాంకు అధికారులను కలవడానికి తెలంగాణ అధికారులు రెడీ అవుతున్నారు.

మరోవైపు మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రూ.36వేల పైచిలుకు పనులలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి అనుమతులు మజూరు చేయగా, తాజాగా మరికొన్నింటికి అనుమతులు జారీ చేసేందుకు నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లో ప్రణాళిక వ్యయం కింద దీనికి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును పూర్తిగా రుణాలపై ఆధారపడి పూర్తిచేయాల్సిందే.

కానీ... మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికీ రెండు సంస్థలు మాత్రమే ముందుకు వచ్చాయి. మిగతా సంస్థల నుంచి కూడా భారీ ఎత్తున స్పందన ఉంటుందని సర్కార్‌ తో పాటు అధికారులు భావించినా వారి ఊహాలకు అందని విధంగా రుణ సంస్థలు దూరంగా ఉంటున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు జరిగే పనులకు నిధులు ఉన్నా..వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు నిధులు ఎలా అని అధికారుల్లో టెన్షన్ పెరిగుతోంది. హడ్కో సంస్థ అంగీకరించిన మొత్తం కూడా ఇస్తుందా? లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అంగీకరించిన మొత్తాన్ని విడుదల చేయలేదని ఆరోపణలున్నాయి. దీంతో హడ్కో అంగీకరించిన రూ.10వేల కోట్లు ఈ ఏడాది ఇస్తుందా? లేద అనే అనుమానాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి.