Begin typing your search above and press return to search.

మాష్టారి ఇష్యూలో లెక్క తప్పుతోంది కేసీఆర్

By:  Tupaki Desk   |   30 Dec 2016 4:38 AM GMT
మాష్టారి ఇష్యూలో లెక్క తప్పుతోంది కేసీఆర్
X
ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ విషయం తెలీని వ్యక్తేం కాదు కేసీఆర్. తమ ప్రభుత్వానికి అహంకారం అన్నది లేదని.. అందరిని కలుపుకెళతామని ఆయన చెబుతుంటారు. అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవాలన్నదే తమ లక్ష్యమని.. కొత్త రాష్ట్రంలో కొంగొత్త విధానాలతో ముందుకెళ్లాలన్నదే తన ఆకాంక్ష అంటూ మాటలు చెబుతుంటారు. ఇలాంటి మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఎలా ఉన్నాయన్న విషయం తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి.

తెలివైన వ్యూహకర్తగా.. మంచి వక్తగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకప్పటి తన ఉద్యమ సహచరుడైన కోదండం మాష్టారి విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. కేసీఆర్ నోటి నుంచి ఏ విషయం వచ్చినా.. ‘ఆయన చెప్పిన దాన్లో ధర్మం ఉందే’ అనిపించేలా మాటలు ఉంటాయి. కానీ.. కోదండం మాష్టారి ఎపిసోడ్ లో ఆయన చేసే వాదన చిన్నపిల్లాడికి అర్థమయ్యేలా ఉంటుంది.

చాలామంది తెలంగాణ ఉద్యమకారుల మాదిరి.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే అత్యున్నత పదవుల కోసం కోదండం మాష్టారు ఆశపడలేదు. మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి తన స్వలాభం కోసం.. సర్కారు మీద చీఫ్ రాజకీయ వ్యాఖ్యలు చేసింది లేదు. ఆ మాటకు వస్తే దాదాపు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది వరకూ కేసీఆర్ సర్కారు పట్ల పాజిటివ్ గానే మాట్లాడారు. రెండో ఏడాదిలో మాత్రం సూచనలుగా కొన్ని వ్యాఖ్యలు చేసినా.. అవేమీ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

ప్రాజెక్టుల పేరుతో రైతుల భూసేకరణను ప్రభుత్వం షురూ చేసిందో.. అప్పటి నుంచో తన గళాన్ని విప్పటం.. ప్రభుత్వ విధానాల పట్ల తనకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేశారు. అప్పటివరకూ కేసీఆర్ సర్కారు మీద పల్లెత్తు విమర్శలు కూడా చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగుతున్నా.. చూసీచూడనట్లు ఉన్నారే కానీ తొందరపడింది. క్షేత్ర స్థాయిలో నిజమైన సమస్యల మీద ఫోకస్ చేసిన కోదండం.. ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయే వారి పక్షాన చేరి.. బాధితులకు అండగా గళం విప్పారు.

నిజానికి ఈ ఇష్యూను క్లోజ్ చేయటం పెద్ద ఇబ్బందేం కాదు. నిజానికి కేసీఆర్ లాంటి నేత స్వయంగా రంగంలోకి దిగి.. ఇష్యూ మీద ఫోకస్ చేస్తే అదెప్పుడో పూర్తి అయ్యేది కూడా. తనదైన రాజకీయ చతురతతో.. నిర్వాసితుల ఇష్యూకు సరైన పరిష్కారం చేసేలా కోదండం మాష్టారితో సహా.. పలువురు మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి.. వారిచ్చిన సలహాల మేరకు వ్యవహరిస్తే.. అది ఆయనకు మరింత ప్లస్ అయ్యేది.

కానీ.. కొన్ని విషయాల్లో పట్టుదలకు పోయే కేసీఆర్.. ప్రాజెక్టుల విషయంలోనూ.. వాటి డిజైన్ విషయంలోనూ తన మాటకు తగ్గట్లే పనులు జరగాలన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శ ఉంది. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలకు కలసిపోయేలా చేసి.. జేఏసీని ఏర్పాటు చేయించి.. తెలంగాణ వస్తుందంటే ఎవరి దగ్గరికైనా వెళ్లేందుకు వెనుకాడని కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఆయనకే చేటుగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

భూసేకరణ చట్టం విషయంలో కేసీఆర్ తన వాదనను వినిపించి.. దానికి మార్పులు చేర్పులు చేసేలా బిల్లును పాస్ చేసుకున్నా.. అది ఆయనకు ప్లస్ కంటే కూడా మైనస్ గానే మిగిలిపోతుందని చెప్పక తప్పదు. భూసేకరణకు చికాకు పుట్టిస్తున్న చట్టంలోని అంశాల్ని పక్కన పెట్టేసి.. తాను అనుకున్నట్లుగా భూముల్ని సేకరించుకునేందుకు తాజా బిల్లు తయారైందన్నది చెప్పక తప్పదు. ఆ విషయాన్ని ఎంత దాచేసినా.. తన మాటలతో ఎంతగా కవర్ చేయాలని చూసినా అది సాధ్యం కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించక తప్పదు.

కేసీఆర్ లాంటి తెలివైన నేత.. కోదండం మాష్టారు దీక్ష చేసే అవకాశమే ఇవ్వకూడదు. సమర్థుడైన పాలకుడు ఎలా ఉండాలి? దీర్ఘకాలం అధికారం తన చేతుల్లో మాత్రమే ఉండాలని ఫీలయ్యే కేసీఆర్ లాంటి చతురత ఉన్న అధినేత ఎలా వ్యవహరించాలి? తాను తప్పులు చేసినా.. వేలెత్తి చూపలేని పరిస్థితిని సృష్టించుకోవాలి. నిజానికి కొద్దికాలం క్రితం వరకూ అలాంటి పరిస్థితే ఉంది. ఉద్యమకారులు.. మేధావులు.. మీడియా అందరూ తనను తప్పు పట్టలేని వాతావరణాన్ని సృష్టించటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

అయితే.. తన ఈగోతో అలాంటి పరిస్థితి డిస్ట్రబ్ అయ్యేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న వాదన ఇప్పుడు వ్యక్తమవుతోంది. గోరుతో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్న చందంగా.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని.. తన సలహాలతో సూచనల రూపంతో చెబుతున్న కోదండం మాష్టారి విషయంలో కాస్తంత పాజిటివ్ గా కేసీఆర్ వ్యవహరించి ఉంటే.. ఈ రోజున కోదండం మాష్టారి మీద పెల్లుబుకుతున్నసానుభూతి.. కేసీఆర్ సర్కారు మీద వస్తున్న విమర్శలు వచ్చి ఉండేవి కావన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన పట్టును ఎక్కడా కోల్పోకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్.. కోదండం మాష్టారి విషయంలో మాత్రం తప్పు మీద తప్పు చేయటం కనిపిస్తోందన్న విమర్శ ఉంది. ప్రతి అంశాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొనే కేసీఆర్.. మాష్టారి ఇష్యూలో మాత్రం బ్యాలెన్స్ ఎందుకు మిస్ అవుతున్నారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/