Begin typing your search above and press return to search.

ఇచ్చిపుచ్చుకోవాలని కేసీఆర్ చెబుతున్నదెందుకు?

By:  Tupaki Desk   |   16 April 2016 4:50 AM GMT
ఇచ్చిపుచ్చుకోవాలని కేసీఆర్ చెబుతున్నదెందుకు?
X
తీసుకోవటమే కానీ ఇవ్వటం గురించి ఏమాత్రం పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్లుండి ఇచ్చిపుచ్చుకోవటం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. విభజన సందర్భంగా దారుణంగా దెబ్బ తిన్న ఏపీకి అన్యాయం జరగకూడదని.. తమలానే వారు కూడా బాగుపడాలన్న ఒక్క మాటను కూడా మాట్లాడని కేసీఆర్ .. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఇచ్చిపుచ్చుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

అన్ని విషయాల్లో ఏపీతో సాధ్యమైనంత మేర సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ‘‘ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకూ తెలంగాణ.. ఏపీల మధ్య లాంగ్ బార్డర్ ఉంది. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇద్దరికీ నష్టమే’’ అని చెప్పిన ఆయన.. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తెలుగు బిడ్డలు ఎక్కడున్నా వాడుకోవటం మంచిదేనంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

కేసీఆర్ నోటి నుంచి ఏ మాట వచ్చినా అది తెలంగాణ ప్రయోజనాల కోసమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకు ఏపీ ప్రజల ప్రయోజనాలు ఎప్పుడూ పట్టలేదన్నది జగమెరిగిన సత్యం. ఏపీ ప్రజలకు లాభం కలిగేలా వ్యవహరించటానికి కేసీఆర్ కలలో కూడా నిర్ణయం తీసుకోరన్న విషయం తెలిసిందే. అలాంటిది రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమన్న మాట వచ్చిందంటే దాని వెనుక పెద్ద లెక్క ఉంటుంది.

ఏపీ.. తెలంగాణ రెండూ తమకు ముఖ్యమే తరహా మాటలు సీమాంధ్ర నేతల నోటి నుంచి వచ్చాయే కానీ.. ఏ తెలంగాణ నేత నోటి నుంచి అలాంటి మాటలు రాలేదన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. అంతదాకా ఎందుకు.. విభజన కారణంగా ఇరు ప్రాంతాల వారికి నష్టం జరగకూడదన్న మాట ఏ తెలంగాణ నేత నోటి వెంటా రాలేదు. ఇక.. కేసీఆర్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది.. ఎన్నడూ లేని విధంగా.. ఏపీ.. తెలంగాణలు ఇచ్చిపుచ్చుకోవాలంటూ కేసీఆర్ చెప్పటం ఏమిటి?

కేసీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన సర్దుబాటు ధోరణి మాటల వెనుక ఏపీ నుంచి వెళ్లే గోదావరి జలాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. పోలవరం ముంపు గ్రామాల కింద ఏపీకి వెళ్లిన ఐదు గ్రామాల్ని తెలంగాణకు తీసుకునే క్రమంలోనే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రామాలు కానీ తెలంగాణ కిందకు వచ్చేస్తే పెద్ద ఎత్తున గోదావరి నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే.. కేసీఆర్ నోటి నుంచి ఇప్పుడు స్నేహపూర్వక మాటలు వస్తున్నాయ్. అవసరం ఎవరి నోటి నుంచైనా ఎలాంటి మాటలైనా వచ్చేలా చేస్తుంది. ఇందుకు కేసీఆర్ మినహాయింపు కాదు సుమా.