Begin typing your search above and press return to search.

ఒకటి పెంచారు.. ఒకటి కోస్తున్నారు!

By:  Tupaki Desk   |   3 Sept 2016 10:30 PM IST
ఒకటి పెంచారు.. ఒకటి కోస్తున్నారు!
X
తెలంగాణ ముఖ్యమంత్రి అంతా లెవెల్‌ చేసేస్తున్నారు. ముఠా మేస్త్రి చిత్రంలో విలన్‌ ఓ డైలాగు పలుకుతూ ఉంటాడు. ''ఒక ప్రాణం తీశా.. ఒక ప్రాణం పోశా.. లెవెలైపోయింది'' అంటూ ఉంటాడు.. ఇది రాజకీయం మరియు పరిపాలన వ్యవహారాలు అయినప్పటికీ.. ఒకదానికొకటి సంబంధంలేని అంశాలను ఒకటిపెంచుతూ - మరొకటి తగ్గిస్తూ.. కేసీఆర్ తనదైన శైలిలో 'లెవల్‌' చేసేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తుదిరూపు సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ జిల్లాల సంఖ్యను కేసీఆర్‌ బాగా పెంచేశారు. అదే సమయంలో తన కేబినెట్‌ లోని మంత్రుల సంఖ్యను మాత్రం కేసీఆర్‌ తగ్గించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో ఎందరు మంత్రులు ఉండడానికి అవకాశం ఉందో.. ఖాళీ లేకుండా అందరు ప్రస్తుతం ఉన్నారు.

అయితే వీరిలో చాలా మంది మంత్రుల మీద కేసీఆర్‌ ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో ఈ మేరకు కొన్ని కథనాలు వచ్చాయి. కేసీఆర్‌ తన కేబినెట్‌ సహచరుల్లో కొందరిని తొలగించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నాళ్లపాటూ ఖాళీలను అలాగే ఉంచుతారా... లేదా వెంటనే వేరొకరితో భర్తీచేసి.. పునర్‌ వ్యవస్థీకరణ పర్వం పూర్తి చేస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తికి గురవతున్న మంత్రులు తెలంగాణ కేబినెట్‌ లో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో.. కొత్తగా పదవులు ఆశిస్తున్న వారు కూడా పుష్కలంగా ఉన్నారు. చాలా మందికి కేసీఆర్‌ మంత్రి పదవి ఇస్తానంటూ బహిరంగ వాగ్దానాలు కూడా చేసి ఉన్నారు. ఆ నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ గ్యారంటీ అని.. కాకపోతే ప్రాంతాల వారీ సమతూకం పాటించే నిమిత్తం.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన వెంటనే.. కేబినెట్‌ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ఎవరి మెడపైన కేసీఆర్‌ కత్తి వేలాడుతున్నదో వేచిచూడాలి.