Begin typing your search above and press return to search.

అప్పుడు జయలలిత.. ఇప్పుడు కేసీఆర్

By:  Tupaki Desk   |   23 Sept 2016 1:35 PM IST
అప్పుడు జయలలిత.. ఇప్పుడు కేసీఆర్
X
కొద్ది నెలల క్రితం చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలో చాలాచోట్ల బోట్లు వేసుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. సినీ ప్రముఖులు మొదలు సామాన్యుల వరకూ అందరూ ఎవరికి వారుగా ముందుకొచ్చి.. ఒకరికి ఒకరు అన్నట్లుగా వ్యవహరించి తోచిన సహాయాన్ని అందించారు. చెన్నై వరద తాకిడికి గురైన లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది లేదు. ఒక్కరంటే ఒక్కరిని పరామర్శించిన పాపాన పోలేదు.

కట్ చేస్తే.. తాజాగా మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. మరో రెండు రోజుల వరకూ భారీ వర్షమేనని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షంతో నష్టపోయిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. రోజులు గడుస్తున్నా.. అపార్ట్ మెంట్లను చుట్టేసిన వరద నీరు ఇంకా వెళ్లిపోని పరిస్థితి. రోజుల తరబడి వరద నీటిలో నానుతున్న భారీ భవనాలు ఏమవుతాయన్న భయంతో సగటు జీవి వణికిపోతున్నాడు.

ఇలాంటి వేళ.. మేం ఉన్నామంటూ ప్రభుత్వం ఉరుకులు పరుగులు తీయాలి. రాష్ట్ర రథసారధి తన సత్తా ప్రదర్శించాలి. అధికార యంత్రాగాన్ని పరుగులు తీయాలి. సహాయక చర్యల్ని నేరుగా సమీక్షించాలి. గంట గంటకూ ఏం జరుగుతోంది? ఇంకేం జరగాలి? అన్న విషయాల మీద అప్ డేట్ తెలుసుకోవాలి. రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించాలి. ఇన్ని చేయాల్సి ఉన్నా.. హైదరాబాద్ లో ఇలాంటివేమీ జరుగుతున్నది కనిపించదు. మంత్రి కేటీఆర్ తప్ప మిగిలినోళ్లు అడ్రస్ లేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో కూర్చున్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అని ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఓపక్క హైదరాబాద్ అతలాకుతలం అవుతుందన్న విషయం తెలిసినా ఆయన అక్కడే ఉన్నారు. కాస్త పెద్ద మనసు చేసుకొని గురువారం రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి.. పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకొని సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో అసాధారణ పరిస్థితి చోటు చేసుకుందన్న వ్యాఖ్య చేశారు.

మహానగరంలో పరిస్థితి టూమచ్ గా ఉందన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఢిల్లీలోనే ఉండిపోవటంలో అర్థమేంది? నగరంలో ఉండి.. ఉన్నతాధికారుల వెన్నంటే ఉండి.. వారికి ఎప్పటికప్పుడు టార్గెట్ ఫిక్స్ చేసి.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం.. మంత్రివర్గ సభ్యుల్ని ప్రాంతాల వారీగా బాధ్యుల్ని చేసి పరిస్థితిని సమీక్షించే ఎంత బాగుండు? కానీ.. అలాంటివేమీ తాజాగా హైదరాబాద్ లో కనిపించటం లేదని చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు నాడు చెన్నై వరదల సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాని తమిళనాడు సీఎం జయలలితకు.. తాజాగా హైదరాబాద్ వాన బీభత్సం నేపథ్యంలో ఢిల్లీలోనే ఉండిపోయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద తేడా లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.