Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త ఆశల టానిక్.. ‘‘లానినో’’

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
కేసీఆర్ కొత్త ఆశల టానిక్.. ‘‘లానినో’’
X
ఆశ మనిషికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గడిచిన పాడు రోజుల్ని పక్కన పడేసి.. వచ్చే మంచి రోజుల గురించి గొప్పగా చెప్పేయటం అందరికి సాధ్యమయ్యేది కాదు. కొందరిలో మాత్రమే ఆ కళ ఉంటుంది. అలాంటి క‌ళ‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో పుష్కలంగా ఉంద‌ని చెప్పాలి. పరిస్థితులకు తగ్గట్లు మాట్లాడి.. కొత్త ఉత్సాహాన్ని పెంచి.. తనకు తెలిసిన కొత్త విషయాన్ని ఆసక్తికరంగా అందరికి అర్థమయ్యేలా చేసి.. కొత్త ఆశల్ని పెంచటంలో ఎవ‌రైనా ఆయన తర్వాతే. గత కొన్నేళ్లుగా ‘ఎల్ నినో’ మాట వినటం.. విన్నంతనే ఉలిక్కిపడటం తెలిసిందే. వర్షాల్ని తీవ్రంగా గండికొట్టి.. పెద్ద ఎత్తున ఎండల్ని మిగిల్చి.. పీడకల మాదిరి నిలిచిన ఈ దశ పూర్తి అయ్యిందని.. ఇక రానున్న ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకూ మంచికాలమే అన్నట్లుగా చెబుతున్న కేసీఆర్ మాటలు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవనటంలో సందేహం లేదు.

కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లానినో గురించి పదే పదే చెబుతున్నారు. ఎల్ నినో గురించి అందరికి అవగాహన ఉంది కానీ.. ఈ లానినో చాలామందికి కొత్త ముచ్చటేనని చెప్పాలి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏర్పడిన ఎల్ నినో కారణంగా కరవు ఏర్పడటం.. వర్షాలు పడకపోవటం తెలిసిందే. అయితే.. ఆ దశ ముగిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని.. ఇప్పుడు లానినో దశ వచ్చేసిందని.. ఇది ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకూ ఉంటుందని కేసీఆర్ చెబుతున్నారు. ఈ లానినో పరిస్థితుల్లో బ్రాహ్మండమైన వర్షాలు పడే వీలుందన్న కొత్త ఆశల్ని కల్పిస్తున్నారు.

మరి.. కేసీఆర్ చెప్పినట్లే లానినో వచ్చేసిందా? శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసేస్తున్నారా? అంటే భిన్న వాదనలు ప్రస్తావించాల్సిందే.

లానినో ఈ ఏడాదికి ఇంకా మొదలు కాలేదని నాసా చెబుతోంది. మరోవైపు.. జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం లానినో ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు. ఇక.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త లెక్క ప్రకారం కూడా లానినో షురూ కావాల్సి ఉందనే చెబుతారు. కేసీఆర్ మాటల్ని చూస్తుంటే.. ఆయన జపాన్ శాస్త్రవేత్తల లెక్కల్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంతకీ లానినో అంటే ఏమిటన్న సందేహం ఇప్పుడు పలువురికి వస్తోంది.

ఈ మధ్యనే జరిగిన మీడియా సమావేశంలో ఈ లానినో ముచ్చటను ప్రస్తావించిన కేసీఆర్.. ఇప్పుడు తాను పాల్గొన్న ప్రతి సభలోనూ.. దీని గురించి ప్రస్తావించి.. ఫ్యూచర్ ఇంకా సూపరో అని ఊరిస్తున్నారు. సాంకేతికంగా లానినో ఏమిటన్నది చూస్తే.. ఫసిపిక్ మహాసముద్రంలో సాధారణంగా 0.5డిగ్రీలు.. అంతకంటే తక్కువగా ఉంటే ఆ పరిస్థితిని లానినోగా వ్యవహరిస్తారు. అదే సమయంలో సాధారణం కంటే 0.5 శాతం.. అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని ఎల్ నినో గా వ్యవహరిస్తారు. వాతావరణ మార్పులకు ఇదెంతో ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడదే మాటను కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తూ.. అందరిలో కొత్త ఉత్సాహాన్ని పెంచేలా చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/