Begin typing your search above and press return to search.

ఆయ‌న బీసీ వ్య‌తిరేకా?

By:  Tupaki Desk   |   9 April 2015 12:30 PM GMT
ఆయ‌న బీసీ వ్య‌తిరేకా?
X

ఈ మ‌ధ్య కుల అభిమానం(!) బాగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ప్ర‌తి చ‌ర్య‌ను త‌మ కులం కోణంలోనే ఎక్కువ‌మంది చూస్తున్నారు. అందులోనూ దాదాపు ఒకే ర‌క‌మైన ప‌రిస్థితి ఉన్న‌వారికి ఒక న్యాయం....త‌మ‌కు మ‌రో న్యాయం అనేదాన్ని ఎవ్వ‌రూ స‌హించ‌డం లేదు. పైగా ఆయా ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించే వారి దృష్టికి తీసుకు వెళ్లినా.. ప‌ట్టించుకోకుంటే కోపం న‌షాళానికి అంట‌క మాన‌దు. తెలంగాణ‌లోని బీసీలు ఆ ప్ర‌భుత్వంపై ఇపుడు అదే కోపంతో ఉన్నార‌ని సామాజిక విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తెలంగాణ‌లో బీసీల జ‌నాభా ఎక్కువ‌గా ఉంది. మెజార్టీ ఓట్లు వారివే. తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్‌లో వారికి ఇప్ప‌టివ‌ర‌కు చెప్పుకోద‌గ్గ న్యాయం ఏది జ‌ర‌గ‌లేదు. మిగ‌తా వ‌ర్గాల వారికి కుల‌సంఘాల భ‌వ‌నాలు క‌ట్టిస్తామ‌నే హామీ ద‌క్కాయి. పేద గిరిజ‌నుల‌కు, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇస్తామ‌న్నారు, తమ సంగ‌తి మ‌ర్చేపోయారు అన్న ఆవేద‌న తెలంగాణ‌లోని వెన‌క‌బ‌డిన వ‌ర్గాల్లో ఉంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన క‌ళ్యాణ‌ల‌క్ష్మీలో గిరిజ‌నుల‌ను చేర్చిన‌పుడే త‌మ‌కు సైతం ఆ అవ‌కాశం క‌ల్పించాల‌ని బీసీలు కోరారు. అయినా ప్ర‌భుత్వం స‌సేమిరా అంది.

ఇటీవ‌ల బీసీ నేత‌, టీడీపీ ఎంపీ దేవేంద‌ర్‌గౌడ్ త‌న ఎంపీ నిధుల‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భ‌వ‌న్‌లు నిర్మించి ఇస్తాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వం ప‌రిపాల‌న ప‌ర‌మైన ఇవ్వ‌డంతో పాటు ఎక‌రం స్థ‌లం కేటాయిస్తే త‌న సొంత ఖ‌ర్చుల‌తో అన్ని జిల్లా కేంద్రాల‌లో బీసీ భవ‌న్‌ల‌ను నిర్మించి ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖ రాసి దాదాపు ప‌దిహేను రోజులు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ స్పంద‌న లేదు.

అమ్మ పెట్ట‌దు..అడుక్కు తిన‌నియ్య‌దు అన్న రీతిలో ప్ర‌భుత్వం త‌మ‌కోసం ఏం చేయ‌దు.పైగా చేస్తాన‌ని త‌నంత‌ట తానుగా ముందుకు వ‌చ్చిన నాయ‌కుడిని అనుమ‌తి ఇచ్చేందుకు ఏం క‌ష్టం అనే ప్ర‌శ్న‌లు తెలంగాణ‌లోని బీసీ వ‌ర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పీపుల్స్ ప‌ల్స్ ప‌సిగ‌ట్ట‌డంలో దిట్ట అయిన కేసీఆర్ ఈ విష‌యంలో ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి మ‌రి.