Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్‌ లో కేసీఆర్ లెక్క త‌ప్పిందా?

By:  Tupaki Desk   |   28 Sep 2015 9:35 AM GMT
గ్రేట‌ర్‌ లో కేసీఆర్ లెక్క త‌ప్పిందా?
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని డివిజ‌న్ ల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సానుకూలంగా లేర‌న్న మాట వినిపిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 150 కార్పొరేష‌న్ డివిజ‌న్ ల‌ను 200 డివిజ‌న్ల‌గా మార్చాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ట్లుగా తెలిసిందే. తాజాగా ఈ ఆలోచ‌నను ముఖ్య‌మంత్రి విర‌మించుకున్న‌ట్లుగా తెలంగాణ బీజేపీ అధినేత కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. తాను చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ఆయ‌న చెబుతున్న లెక్క చూసిన‌ప్పుడు కేసీఆర్‌.. డివిజ‌న్ల పెంపు దడ పుట్టించే వ్య‌వ‌హారంగా మారి ఉంటుంద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

ప్ర‌స్తుతం 150 డివిజ‌న్ల‌ను మొద‌ట 200 డివిజ‌న్లుగా మార్చాల‌ని భావించినా.. దాని వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అవుతుంద‌ని తేలింద‌న్న‌ది కిష‌న్ రెడ్డి మాట‌. అదెలా అంటే.. ఎంఐఎంకు అనుకూలంగా ఉండే పాత‌బ‌స్తీ డివిజ‌న్లు.. పెంపు కార‌ణంగా తగ్గిపోతాయ‌ని.. శివార్లు డివిజ‌న్లు పెరిగిపోతాయ‌ని.. అదే జ‌రిగితే మ‌జ్లిస్‌.. టీఆర్ ఎస్ ల‌కు దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌న్న విష‌యం.. ఆయ‌న చేయించుకున్న స‌ర్వేల్లో తేలింద‌ని.. ఈ కార‌ణంతోనే డివిజ‌న్ల పెంపు విష‌యంలో టీఆర్ ఎస్ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

పాత‌బ‌స్తీలోని ఒక్కో డివిజ‌న్ లో 12 వేల మంది నుంచి 20వేల ఓట్లు ఉంటే.. న‌గ‌ర శివార్లుల్లో మాత్రం అందుకు భిన్నంగా ప్ర‌తి డివిజ‌న్ లో ల‌క్ష మంది ఓట‌ర్లు ఉన్నార‌ని.. వీరంతా డివిజ‌న్ల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో స‌ర్దుబాటు చేస్తే.. మ‌జ్లిస్.. టీఆర్ ఎస్ కు జాయింట్ గా దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మని ఆయ‌న విశ్లేషిస్తున్నారు. మ‌రింత న‌ష్టం వాటిల్లే ప‌నిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసే ఛాన్స్‌ లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.