Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా మీద మోడీని నిలదీయనున్న కేసీయార్...?

By:  Tupaki Desk   |   25 March 2023 8:00 AM GMT
ప్రత్యేక హోదా మీద మోడీని నిలదీయనున్న కేసీయార్...?
X
బీయారెస్ అనబడే భారత్ రాష్ట్ర సమితి ఏపీ విషయంలో ఒక కచ్చితమైన ప్రజలు మెచ్చిన అజెండాతో ముందుకు సాగనుంది అని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలు పట్టించుకోని విషయాలు కడె పడేసిన అంశాలే బీయారెస్ కి ఇపుడు అతి పెద్ద ఆయుధాలుగా మారనున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు అది ముగిసిన అధ్యాయం అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా మరోసారి అవమానించింది.

ఈ నేపధ్యంలో ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరు అని నిగ్గదీస్తున్నారు బీయారెస్ నాయకులు. ఏపీకి విభజన చట్టంలోని హామీలు అన్నీ అలాగే పడి ఉన్నాయని వాటిని తాము బయటకు తీసి మోడీ సర్కార్ ని నిలదీతామని స్పష్టం చేస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్నదే ఇపుడు బీయారెస్ అజెండాగా ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సైతం ఏ రాజకీయ పార్టీ కూడా ఏమీ అడగడం లేదు. అన్నీ కలసి గమ్మున ఉన్నాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకుని దూకుడు చేస్తూంటే వైసీపీ కానీ టీడీపీ కానీ మరే పార్టీ కానీ కనీసం నోరెత్తడంలేదు.

దీంతో ఈ పాయింట్ ని కూడా బీయారెస్ పట్టుకుంది అని అంటున్నారు. అలాగే గడచిన తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రం ఏపీకి దారుణమైన అన్యాయం చేసినా కూడా ఏపీలోని ఒక్క పార్టీ కూడా గొంతెత్తకపోవడం పట్ల బీయారెస్ నిశితంగా పరిశీలిస్తోంది. ఏపీని ఒక గాడిన పెట్టే బాధ్యత మాది అని బీయారెస్ నేతలు అంటున్నారు.

ఇక చూసుకుంటే ఏపీ బీయారెస్ కి తోట చంద్రశేఖర్ అనే నాయకుడిని  ఎన్నుకోవడంలోనే ఈ ప్రాంతం మీద తన ముద్రను బలంగా వేసేందుకు చూస్తోంది. ఇపుడు ఏపీ ప్రజలను ఆకట్టుకునే అజెండాను ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగమే ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం అని అంటున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనేక వాగ్దానాలు చేసిందని, కానీ వాటిని అమలు చేయడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని బీయారెస్ నాయకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో మోడీ సర్కార్ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై బీఆర్‌ఎస్‌ ఒత్తిడి తీసుకువస్తుందని ఏపీకి చెందిన  బీఆర్‌ఎస్‌ కీలక  నేత ఒకరు తెలిపారు.

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, కానీ మోడీ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు.విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మౌనంగా ఉన్న పార్టీలను కూడా బీఆర్ఎస్ తప్పుబట్టింది. అదే విధంగా అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ మోడీ ఏపీకి అన్యాయం చేశారని, మెట్రో రైలు ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించలేదన్నారు.

ఇలా చాలా విషయాలను బీయారెస్ నేతలు ఇపుడు టేకప్ చేశారు. ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నవే వీటి విషయంలో బీయారెస్ అధినేత కేసీయార్ డేరింగ్ గా కేంద్రం మీద పోరాడితే మాత్రం ఏపీ జనాల మద్దతు కచ్చితంగా లభిస్తుందని ఆశతో బీయారెస్ నేతలు ఉన్నారు. కేసీయార్ అంటే ఏపీ జనాలకు కోపం సహజంగా ఉంటుంది. దానికి కారణం ఏపీ విభజనకు కారకుడు అయ్యారని, ఇపుడు విభజన హామీలను సాధించే ప్రయత్నం చేయడం ద్వారా ఆయన ఏపీ ప్రజల మనసు గెలుచుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

ఇక ఏపీ బీయారెస్ నేతల మాటలు ఎలా ఉన్నాయంటే ఏపీ ప్రజలకు డేరింగ్ అండ్ డేషింగ్ నేత అయిన కేసీయార్ లాంటి వారి అవసరం ఉందని, ఆయనే రావాలని అంటున్నారు. సో బీయారెస్ స్ట్రాటజీ అయితే బాగుంది. మరి ఆచరణలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.