కేసీయార్ కి ముఖ్యమంత్రి పదవి మీద మోజు తీరిపోయింది. ఆయన రెండు సార్లు సీఎం సీట్లో కూర్చుకున్నారు. ఇక టీయారెస్ ని మూడవసారి కూడా గద్దెనెక్కించి తన వారసుడిగా ఉన్న కేటీయార్ కి పట్టం కట్టాలని బలమైన కోరిక ఉంది. దాంతో పాటు తాను ఖాళీగా ఉండకూడదు, లక్ బాగా కలిసొస్తే జాతీయ రాజకీయాలలో వెలిగిపోవచ్చు. కంప్లీట్ గా శూన్యం లేకపోయినా విపక్ష శిబిరంలో జాగా ఖాళీ అయితే ఉన్నది. అలాగే అధికార ఆశలు కూడా బాగానే మిణుకుమిణుకుమంటున్నాయి.
అందుకే కేసీయార్ మదిలో నాలుగేళ్ళుగా మెదులుతున్న జాతీయ పార్టీ ఆలోచన ఇన్నేళ్ళకు కార్యరూపం దాలుస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీని గద్దె దించడం అంటూ జరిగితేనే విపక్షానికి అవకాశం ఉంటుంది. అది ఏకమొత్తంగా ఒక పార్టీకి కాదు వివిధ పార్టీలతో కూడిన కూటమికి. మరి కూటమిలో ప్రధాని సీటు ఎవరికి దక్కుతుంది అంటే అక్కడ నంబర్ గేమ్ దే కీలక పాత్ర.
అందుకే కేసీయార్ అర్జంటుగా తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్దారని అంటున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుని పక్క రాష్ట్రంలో ఓట్లు అడిగితే ఏ మాత్రం బాగోదు, పొలిటికల్ గా అసలు సింక్ అవదు కూడా. అందుకే ఆయన దాని కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇక కేసీయార్ కి తెలంగాణా తప్పించి ఎక్కడ సీట్లు దక్కుతాయి అంటే పొరుగున ఉన్న ఆంధ్రా మీదనే అధికమైన ఆశలు ఉన్నాయి. ఆంధ్రా నిన్నటివరకూ తెలంగాణాతో కలసి ఉంది.
ఉద్యమకాలంలో అయితే వ్యతిరేకత ఎంతో కొంత ఉంది కానీ తరువాత మాత్రం కేసీయార్ కి ఆంధ్రాలో బాగానే ఆదరణ లభించింది. చిత్రమేంటి అంటే చంద్రబాబు, జగన్ రాజకీయంగా ప్రత్యర్ధులు అయినా ఇద్దరూ కేసీయార్ ని ఆహ్వానించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీయార్ ని బాబు పిలిస్తే తన సీఎం పదవి ప్రమాణ స్వీకారానికి జగన్ కేసీయార్ ని పిలిచి పెద్ద పీట వేశారు.
ఈ విధంగా చూస్తే కేసీయార్ కి ఏపీలో ఎలా ఇమేజ్ ఉందో అర్ధమవుతుంది. ఇక కేసీయార్ సామాజికవర్గం ఏపీలో కొన్ని జిల్లాలలో బలంగా ఉంది. కేసీయార్ పూర్వీకులు ఉత్తరాంధ్రాలోని బొబ్బిలికి చెందిన వారు అని చెబుతారు. మొత్తానికి ఏదైతేనేమి ఏపీతో కేసీయార్ కి రాజకీయ సామాజిక బంధాలు గట్టిగానే ఉన్నాయి.
ఆ ధైర్యంతోనే ఆయన జాతీయ పార్టీ అని అంటున్నారు. అంటే తెలంగాణాలో పదిహేడు మాత్రమే ఎంపీ సీట్లు ఉంటే ఏపీలో పాతిక దాకా ఉన్నాయి. ఇక ఏపీ జనాలకు ప్రత్యేక హోదా కావాలి. అలాగే విభజన హామీలు నెరవేరాలి. పోలవరం కల సాకారం కావాలి. ఇలాంటి వాటి మీద తన అజెండా సెట్ చేసి పెట్టుకుని తన పార్టీని కనుక ఎన్నుకుంటే కచ్చితంగా ఏపీకి వీటిని సాధిస్తానని కేసీయార్ గట్టిగా చెప్పవచ్చు. అది ఆయనకు బహు సులువు కూడా.
ఆయన ఎటూ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. ఏపీ జనాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అన్న సంకేతాలు ఉన్నాయి. దాంతో పాటు ఏపీలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీజేపీతో సాన్నిహిత్యాన్నే కోరుకుంటున్నాయి. దాంతో కేసీయార్ కనుక బీజేపీ మీద రణభేరీ మోగిస్తే అది పొలిటికల్ గా ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. ఈ రకమైన ఎత్తుగడలతోనే కేసీయార్ భారత రాష్ట్ర సమితిని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఎలా వచ్చినా ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు ఏపీలో రాబట్టుకుని మరికొన్ని తెలంగాణాలో సెట్ చేసుకుంటే ఈ నంబర్ గేమ్ తో పాటు మిగిలిన రాష్ట్రాలలో వీలున్న చోట్ల పొత్తు పేరిట కొన్ని సీట్లు తీసుకుని బరిలోకి దిగితే కచ్చితంగా బిగ్ నంబర్ తన జేబులో ఉంటుంది, అపుడు ప్రధాని పీఠం కోసం బేరమాడే శక్తి వస్తుంది అన్నదే కేసీయార్ ఆలోచన అని అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో కేసీయార్ తన మిత్రుడు అయిన జగన్ మీదకే గన్ పెట్టబోతున్నారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవునే అనిపించకమానదు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో. ఏది ఏమైనా కేసీయార్ ని ఆంధ్రా బాగా ఊరిస్తోంది అన్నది నిజం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.