Begin typing your search above and press return to search.

ఒంటేరు కారెక్కే ఎపిసోడ్‌ లో కొత్త కోణం!

By:  Tupaki Desk   |   18 Jan 2019 5:35 AM GMT
ఒంటేరు కారెక్కే ఎపిసోడ్‌ లో కొత్త కోణం!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్లానింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అంద‌రు నాలుగు కోణాల్లో చూస్తే.. కేసీఆర్ ప‌ద్నాలుగు కోణాల్లో చూడ‌ట‌మే కాదు.. రాబోయే ప‌దేళ్ల‌లో ఎలా ఉండాలి? ఏం చేయాలి? అన్న అంశాల మీద ఆయ‌న దృష్టి ఉంటుంది. ఇదే తీరు ఆయ‌న్నుతెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ అధినేత‌గా మార్చింద‌ని చెప్పాలి.

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో క‌నిపించే కోణం ప్ర‌త్య‌ర్థుల పీచ‌మ‌ణ‌చ‌టం. ప‌వ‌ర్లో ఉన్న వారు త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను అదే ప‌నిగా హింస‌కు గురి చేస్తుంటారు. వేధింపుల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. శ‌ర‌ణు కోరినా ప‌ట్టించుకోరు. రాజీకి వ‌చ్చినా నో అంటారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్న‌మైన ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తారు. త‌న‌ను కాద‌న్న వారిపై కేసీఆర్ గుర్రుగా ఉంటారు. కొంత‌మందికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో క‌నిక‌రం లేన‌ట్లుగా ఉండే కేసీఆర్‌.. కొన్ని సంద‌ర్భాల్లో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాను క‌త్తి క‌ట్టిన నేత కాస్త త‌గ్గి.. పాహిమాం.. పాహిమాం ప్ర‌భు అంటే.. ఓకే అనేయ‌ట‌మే కాదు.. వెనువెంట‌నే వెన‌క్కి త‌గ్గుతారు. శ‌ర‌ణు కోరిన వారి మ‌న‌సు సైతం ఫిదా అయ్యేలా వారిప‌ట్ల గౌర‌వ మ‌ర్యాద‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తారు.

శ‌ర‌ణు కోరామ‌న్న వేద‌న‌లో ఉన్న వారి మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే కాదు.. అరే.. ఇంత‌కాలం ఇలాంటి మ‌నిషితో అన‌వ‌స‌రంగా కోట్లాడామా? అన్న భావ‌న క‌లిగేలా చేస్తారు. అదే కేసీఆర్ స్పెషాలిటీ. మిగిలిన వారి విష‌యంలో కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో.. ఒంటేరు ఇష్యూలోనూ ఆయ‌న అదే తీరును ప్ర‌ద‌ర్శించార‌ని చెబుతారు. భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప‌రిణామాల్ని దృష్టిలో పెట్టుకొని.. ఒంటేరును కారెక్కుతారా? అన్న విష‌యానికి కాకితో క‌బురు పంప‌టం.. అలా క‌బురు పంపిన కాకి కేసీఆర్‌ కు అత్యంత స‌న్నిహితుడు కావ‌టంతో.. ఒంటేరు సైతం మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే అన్న‌ట్లు చెబుతున్నారు.

అంతేనా.. కారెక్క‌నున్న ఒంటేరు ఎపిసోడ్‌ లో మ‌రో ఆస‌క్తిక‌ర కోణం ఉంది. కేసీఆర్ ను ఎంత‌లా వ్య‌తిరేకిస్తారో.. హ‌రీశ్ ను సైతం అంతే వ్య‌తిరేకించటం ఒంటేరులో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. హ‌రీశ్ అంటే ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఒంటేరును ప్ర‌త్యేక ఆహ్వానంతో పార్టీలోకి చేర్చుకోవ‌టం చూస్తుంటే.. రానున్న రోజుల్లో త‌న‌కు.. త‌న వార‌సుడి ప‌ట్ల వీర విధేయ‌త‌ను ప్ర‌దర్శించేలా కేసీఆర్ ప్లాన్ చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. చూస్తుంటే.. తాను జాతీయ రాజ‌కీయాల్లో బిజీ అయ్యే వేళ‌.. త‌న రాజ‌కీయ వార‌సుడికి ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌ని రీతిలో కేసీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.