Begin typing your search above and press return to search.

నిరుద్యోగుల కోసం కేసీఆర్‌ కొత్త ప‌థకం...!

By:  Tupaki Desk   |   8 April 2018 6:54 AM GMT
నిరుద్యోగుల కోసం కేసీఆర్‌ కొత్త ప‌థకం...!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగిస్తూనే..యువ‌త‌ను ఫిదా చేసేందుకు కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. నిరుద్యోగ అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తుండడం - నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రధాన ప్రతిపక్షం ప్రకటిస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ చెక్‌ చెప్పేరీతిలో సిఎం ప్రకటన చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. గత ఏడాది ప్లీనరీలో రైతులకు పెట్టుబడి పథకాన్ని సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌.. అది అమలు ప్రారంభమైన వేళ నిరుద్యోగభృతి పథకాన్ని ఈ ఏడాది ప్లీనరీలో ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌తి సంవత్సరం పార్టీ ప్లీనరీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్లీనరీ నిర్వహణపై టీఆర్‌ ఎస్ పార్టీ ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది. ఈ నెల 27న పార్టీ ప్రతినిధుల సభను హైదరాబాద్‌ లో నిర్వహించాలని పార్టీవర్గాలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ సంద‌ర్భంగానే నిరుద్యోగుల‌కు సంబంధించిన ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గత ప్లీనరీలో ప్రకటించిన పెట్టుబడి పథకానికి రైతుబంధుగా నామకరణం చేయగా - ఈ పథకం స్ఫూర్తికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అత్యధిక ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయరంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ - ఈ సారి మరో కీలక రంగంపై వరాల జల్లు కురిపించనున్నారని సమాచారం. నిరుద్యోగుల భృతి పథకాన్ని ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే దీనికి సంబంధించిన గణాంకాలు - నివేదికలు అధికారవర్గాల ద్వారా సిఎం తెప్పించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ రకంగా ప్రజల్లో ఉండాలి.. ప్రజల మనసు గెలవాలి అన్న అంశాలపై అధినేత కెసిఆర్‌ నాయకులు - కార్యకర్తలకు స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించే అవకాశం కనబడుతోంది.

మ‌రోవైపు టీఆర్ ఎస్ ప్లీనరీకి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు దాదాపుగా 15 వేలమంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు - జెడ్పీ చైర్మన్లు - పార్టీ రాష్ట్ర కార్యవర్గం - రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు - కార్పొరేటర్లు - ఎంపీటీసీలు - మండలపార్టీ అధ్యక్షులను ఆహ్వానించనున్నారు. ఒకరోజు నిర్వహించే ఈ సమావేశం వేదికగా ప్రతి సంవత్సరం నిర్వహించే పేట్‌ బషీరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.