Begin typing your search above and press return to search.

ఆర్టీసీ పై వరాలు ..ప్రజలపై బాదుడు ! ఏందయ్యా ఇది ..?

By:  Tupaki Desk   |   2 Dec 2019 11:56 AM GMT
ఆర్టీసీ పై వరాలు ..ప్రజలపై బాదుడు ! ఏందయ్యా ఇది ..?
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు తగిన ప్రతిపలం దక్కుతున్నట్టే అని అనిపిస్తుంది జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే. ఆర్టీసీ కార్మికులు ఏకధాటిగా 55 రోజులపాటు సమ్మె లో పాల్గొన్నారు. అన్ని రోజులు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం దిగి రాకపోవడంతో ..ఇక చేసేదేమి లేక కార్మికులే దిగి వచ్చారు. ఆ తరువాత కూడా ప్రభుత్వం వెంటనే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేదు. రెండు రోజుల తరువాత మంత్రి వర్గం సమావేశం అయ్యి ..ఆర్టీసీ కార్మికులని ఉద్యోగాల్లోకి చేరాలని చెప్పారు. అలాగే ఆ సమావేశం లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ... ఆర్టీసీ ఉంటేనే మీరు ఉంటారు ..లేకపోతే లేదు. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తే..ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం సాధ్యమే అంటూ చెప్పారు.

ఇక ఇదే సమయంలో యూనియన్లని రద్దు చేసారు. అలాగే ఆదివారం రాష్ట్రంలోని ప్రతి డిపో నుండి ముగ్గురు మగవాళ్ళు - ఇద్దరు ఆడవాళ్లు చొప్పున ఐదుగురిని ప్రగతి భవన్ కి పిలిపించుకొని వారితో మాట్లాడారు. అలాగే వారితోనే మధ్యాహ్నం భోజనం కూడా చేసారు. ఉద్యోగులు సమ్మెల పేరుతో సమస్యలను సృష్టించకుండా బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళితే సింగరేణి తరహాలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇలా ఆర్టీసీ కార్మికుల పై వరాలజల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ...ప్రజలపై మాత్రం పెద్ద గుదిబండ వేశారు.

ఆర్టీసీ ని కాపాడాలని అంటే ఉన్న ఏకైక మార్గం టికెట్స్ ధరలు పెంచడం ఒక్కటే మార్గం అని చెప్పి ..టికెట్స్ ధరలని పెంచేశారు. ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆదివారం కార్మికులతో భేటీ సందర్భంగా దీనిని ఒకరోజు వాయిదా వేసింది. తాజాగా, సోమవారం బస్సు ఛార్జీల పెంపును ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రతి కిలోమీటర్ కి 20 పైసలు పెంచనున్నారు. దీనితో సామాన్యుడి జోబుకి భారీగానే చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది.

సెమీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 75 పైసల నుంచి 95 పైసలకు పెంచారు. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీలు కిలో మీటరుకు 87 పైసల నుంచి 107 పైసలకు పెంచారు. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10గా చేసారు. పల్లె వెలుగు బస్సులో కిలో మీటరుకు ఇప్పటి వరకు 63 పైసలుగా ఉన్న ఛార్జీ నేడు అర్ధరాత్రి నుంచి 83 పైసలకు పెంచారు. ఈ నేపథ్యంలో పల్లె వెలుగులో కనీస ఛార్జీ రూ.10 , ఎక్స్‌ప్రెస్ బస్సులో కనీస ఛార్జీ రూ.20 , సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25 , రాజధాని.. వజ్ర ఏసీలో కనీస ఛార్జీ రూ.35 , గరుడ ఏసీలో కనీస ఛార్జీ రూ.35 , వెన్నెల ఏసీ ప్లస్‌లో కనీస ఛార్జీ రూ.70 కి పెంచనున్నారు. అలాగే బస్సు పాస్ ధరలని కూడా పెంచారు. దీనితో నెలకి ఆర్టీసీకి సుమారుగా 750 కోట్ల అదనపు ఆదాయం చేకూరుతుంది అని , వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణ ఆర్టీసీ లాభాల పడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్న విషయం తెలిసిందే.

కాకపోతే ,సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె లోకి వెళ్లి ప్రజలని అనవసర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలని అనిపిస్తే చెయ్ కానీ - సమ్మె కాలంలో కూడా మిమ్మల్ని నిందించకుండా ..నోరుమూసుకుని ప్రత్యామ్నాయాలతో ప్రయాణాన్ని కొనసాగించిన ప్రజలపై ఈ బాదుడేంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.