Begin typing your search above and press return to search.

ఆమె స్ఫూర్తితో ఆర్టీసీ స‌మ్మెను అణిచివేయ‌నున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   4 Oct 2019 2:30 PM GMT
ఆమె స్ఫూర్తితో ఆర్టీసీ స‌మ్మెను అణిచివేయ‌నున్న కేసీఆర్‌
X
తెలంగాణ ఆర్టీసీలో స‌మ్మె ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. త‌మ డిమాండ్ల‌తో ఆర్టీసీ కార్మికులు స‌మ్మె నోటీసు ఇవ్వ‌డం..ప్ర‌భుత్వం త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేయ‌డం తెలిసిన సంగ‌తే. హైదరాబాద్ ఎర్రమంజిల్‌ లో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతోి ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సమావేశం సంతృప్తిగా జరగలేదని… చర్చలు ఫెయిలయ్యాయని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి చెప్పారు. శ‌నివారం నుంచి సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ప్ర‌క‌టించారు. అయితే, ఆర్టీసీ యూనియన్ల సమ్మె నిర్ణయంపై సర్కారు సీరియస్‌‌ గా ఉంది. త‌మిళ‌నాడు త‌ర‌హాలో...తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

స‌మ్మెను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ప్ర‌భుత్వం ఆపివేసేందుకు, అణిచివేసేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ‘ఆర్టీసీలోని వాళ్లందరూ పబ్లిక్‌‌ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్‌‌ ఇదే విషయం చెబుతోంది. సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉన్నాయి. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు సమ్మెకు వెళ్లిన‌పుడు ఇలాగే జరిగింది. తెలంగాణ‌లో కూడా అలాగే జ‌ర‌గ‌వ‌చ్చు`` అని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆర్టీసీ ఉన్న‌తాధికారుల అభిప్రాయం నేప‌థ్యంలో...స‌హ‌జంగానే ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది.

మ‌రోవైపు స‌మ్మెతో సాధార‌ణ పౌరులు ఇబ్బంది ప‌డ‌కుండా...ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం మొత్తం పదివేల ఆర్టీసీ బస్సులు ఉంటే... వాటిలో 2,500 బస్సులు అద్దెకు తీసుకున్నారు. కనుక ఈ అద్దె బస్సులు కచ్చితంగా తిరుగుతాయి. మిగిలిన 7500 బస్సుల్లో రోజుకు రెండువేల బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం తాత్కాలికంగా రెండువేలమంది నిపుణులైన డ్రైవర్లు - తగిన సంఖ్యలో కండక్టర్లను నియమించనున్నారు. డ్రైవింగ్‌ లో కనీసం ఏడాదిన్నర అనుభవంతోపాటు హెవీవెహికిల్ డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగినవారిని తాత్కాలిక డ్రైవర్లుగా నియమిస్తామని - అలాంటివారు ఆర్టీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రవాణాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.

ఒక్కో డ్రైవర్‌ కు రోజు కు రూ.1500 చొప్పున భత్యం చెల్లించనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని వారి టెన్త్ మెమోను త‌న‌ఖా పెట్టుకుని తాత్కాలిక కండక్టర్లుగా నియమించనున్నారు. వీరికి రోజుకు రూ.1000 చొప్పున చెల్లించనున్నారు. వీరే కాకుండా - ఆర్టీసీ రిటైర్డ్ సూపర్‌ వైజర్లు - క్లర్కులు - మెకానిక్కులను కూడా తాత్కాలిక విధులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వీరికి కూడా భత్యం చెల్లిస్తారు. ఈ మేరకు వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్టీసీ డ్రైవర్లు - కండక్టర్లను నియమించుకునే సందర్భాల్లో ఇటువంటి వారికి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్తున్నారు.